
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా బాంబు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు.
ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్‌లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్‌షాట్లను ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్‌లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం.
మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా
న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్‌్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్‌లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు.