డొనాల్డ్‌ ట్రంప్‌ చేతులెత్తేశారా? | Does Donald Trump Steps Back Against Iran | Sakshi
Sakshi News home page

డొనాల్డ్‌ ట్రంప్‌ చేతులెత్తేశారా?

Mar 23 2026 6:03 PM | Updated on Mar 23 2026 7:50 PM

Does Donald Trump Steps Back Against Iran

‘ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్‌ ఇస్తున్నాం. తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం. గత కొన్ని రోజులుగా వారితో చర్చలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం’  ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన.

‘అదేమీ లేదు.. ట్రంప్‌ మాతో చర్చలు జరపలేదు.. అమెరికా భయపడింది.  మాతో అమెరికా ఎటువంటి చర్చలు జరపలేదు. వారికి వారే యుద్ధం ఆపేశారు’ అని వెనువెంటనే ఇరాన్‌ ప్రకటన

అంతకుముందు చూస్తే.. ‘ 48 గంటలే ఇరాన్‌కు గడువు. ఇరాన్‌ లొంగిపోవాల్సిందే’ అంటూ ట్రంప్‌ ప్రకటన.  ఈ మాట యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ ఏదొక సందర్భంలో అమెరికా నోట వస్తూసే ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌ కానీ, రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ కానీ ఇరాన్‌ను వదిలే ప్రసక్తే లేదంటూ గాంభీర్యం ప్రకటించారు. వేటాడుతాం. మా శత్రువులు ఎవరైనా వదిలి పెట్టం. వెంటాడి వేటాడి చంపుతాం. ఎక్కడున్నా తుద ముట్టిస్తాం’ అంటూ రెచ్చిపోయి మాట్లాడారు.  అదే సమయంలో ఇరాన్‌ కూడా ధీటుగానే బదులిస్తూ వచ్చింది.  ‘ అంత సీన్‌ లేదు. లొంగిపోయే ప్రసక్తి అసలే లేదు. మేము ఆరు నెలల కాదు.. ఆరేళ్లైనా యుద్ధం చేస్తాం. ఆ సత్తా మాకు ఉంది. అమెరికా-ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే వరకూ మా పోరాటం ఆగదు’ అని ఇరాన్‌ స్ట్రాంగ్‌గానే కౌంటర్ల ఇస్తూ వచ్చింది. అంతే ధాటిగా యుద్ధం కూడా చేసింది.

ఆ రెండూ ట్రంప్‌కు భయం పుట్టించాయా?
ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.. ఇందులో ఒకటి అమెరికా అధునాతన టెక్నాలజీ కల్గిన ఎఫ్‌-35  విమానాన్ని ఇరాన్‌ డ్రోన్‌ కూల్చేయగా, మరొకటి 4000 కి.మీ రేంజ్‌తో ఒక బాలిస్టిక్‌ మిసైల్‌ను అమెరికా నావికా స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించడం. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. ఆ రెండు ఘటనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కచ్చితంగా భయం పుట్టించే ఉంటాయి. 

మనం ఎంతో అధునాతనం అనుకున్న ఎఫ్‌ 35 విమానం ఎలా కూలిపోయిందనేదనే విషయంపై అమెరికా కచ్చితంగా చర్చలు జరిపే ఉంటుంది. అదే సమయంలో నాలుగువేల కిలోమీటర్ల రేంజ్‌తో క్షిపణిని ఇరాన్‌ ప్రయోగించడమే అమెరికాను డైలమాలో పడేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. 

ఈ రెండు సందర్భాలు కూడా ఇరాన్‌ సైనిక శక్తిని అమాంతం పెంచేశాయి. ఇరాన్‌ బహిరంగంగా ప్రకటించిన దానికి, వాస్తవానికి భిన్నంగానే యావత్‌ ప్రపంచానికి అనిపించింది.  అయితే ఇప్పుడు ట్రంప్‌ ప్రకటనతో వాటికి బలం చేకూరనట్లయ్యింది. 

ఏమాత్రం ఇష్టం లేని యుద్ధం
అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేసిన యుద్ధం.. అమెరికా పౌరులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ అమెరికా పౌరులకే కాదు.. యావత్‌ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధంలో ఎవరు గెలిచినా.. నష్టపోయేది ప్రజలే కాబట్టి.. దీన్ని ఎవరూ స్వాగతించలేదు. ఇక్కడ గెలుపు విషయాన్ని పక్కన పెడితే, దీని వల్ల  ఎన్నో కుటుంబాలు ప్రభావితం అవుతాయనేది అందరికి తెలుసు కానీ, మూడు దేశాల్లో(అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌) జరగాల్సిన విధ్వంసం ఇప్పటికే జరిగిపోయిన తర్వాత ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ  ఆ  యుద్ధానికి దిగిన ఆ మూడు దేశాలు తీవ్రంగా నష్టపోతే..  ప్రపంచ దేశాలపై కూడా ఎక్కువగానే ప్రభావం చూపింది. 

మళ్లీ శాంతి మంత్రం..
మూడు వారాలకు పైగా భారీ విధ్వంసానికి కారణమైన ట్రంప్‌.. ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నారు.  పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తాం అంటూ ప్రకటించేశారు.  అంటే అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడమనేది ట్రంప్‌ నైజమనేది మరోసారి రుజువైంది. అప్పుడు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చిన ట్రంప్‌.. ఇప్పుడు ఇరాన్‌ విషయంలో ఆయనకు ఆయనే తగ్గిరనేది వాస్తవం. అంటే ఇరాన్‌ యుద్ధ సామర్థ్యం ఏమిటో ట్రంప్‌కు చిక్కలేదు. మరొకవైపు ఇరాన్‌ ప్రకటనలు కూడా భయం పుట్టించేంతగానే ఉన్నాయి. 

ఈ క్రమంలో ట్రంప్‌ వెనక్కి తగ్గారనేది వాస్తవం. ఇక్కడ ట్రంప్‌ వెనక్కి తగ్గారనడం కంటే కూడా అమెరికా తేలిపోయింది అనుకోవడం ఇప్పుడు మన వంతైంది. ఎప్పుడూ ప్రపంచ దేశాలకు బిల్డప్‌లు మీద బిల్డప్‌లు ఇచ్చే అమెరికా శక్తి ఏపాటిదో కూడా అందరికీ తెలిసిపోయింది.  అమెరికాకు గట్టి కౌంటర్‌ ఇస్తే వాళ్లను వెనక్కి తగ్గేలా చేయడం పెద్ద కష్టమేం కాదు అనే విషయం ఇరాన్‌ రుజువు చేసిందనేది  కాదనక తప్పదు. చివరకు చేసేదేమీ లేక ట్రంప్‌ ఇలా చేతులెత్తేసే.. మళ్లీ శాంతి మంత్రం జపిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.  అందుకు ఇరాన్‌ ప్రకటన కూడా బలం చేకూరుస్తుంది. తమతో చర్చలు ఏమీ జరపలేదని ఇరాన్‌ ప్రకటించడం కూడా ట్రంప్‌ డబుల్‌ గేమ్‌కు అద్దం పడుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement