Libya History: వెన్నాడుతున్న గడాఫీ అరాచకాలు

 Daniel Storm Libya History Civil war Muammar Gaddafi - Sakshi

ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాలో ‘డేనియల్’ తుఫాను సంభవించిన తర్వాత ముంచెత్తిన వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. లిబియా ఒక చిన్న దేశం. అయితే అనునిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ దేశం అక్కడి గత నియంత ముఅమ్మర్ అల్ గడాఫీ కారణంగా చర్చల్లో నిలిచింది. అలాగే సమృద్ధిగా ఉన్న చమురు సంపద కారణంగానూ పేరొందింది.

గడాఫీ హత్య తర్వాత అంతర్యుద్ధం
2011, అక్టోబర్ 20న గడాఫీ హత్య తర్వాత ఇక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది చాలా కాలం పాటు కొనసాగింది. దీని తరువాత ఇస్లామిక్ స్టేట్ ఇక్కడకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు దర్నా నగరాన్ని తాకిన వరద  సర్వం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. లిబియా విధ్వంసం కథను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా మొదలైన గడాఫీ శకం 
గడాఫీ 27 ఏళ్ల వయసులో తిరుగుబాటుకు పాల్పడి లిబియాలో అధికారంలోకి వచ్చాడు. గడాఫీ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పాలించాడు. ‘బ్రిటన్‌ రాణి 50 ఏళ్లు, థాయ్‌లాండ్‌ రాజు 68 ఏళ్లు పాలించగలిగినప్పుడు నేనెందుకు పాలించలేను’ అని గడాఫీ తరచూ అంటుండేవాడు. గడాఫీ 1942 జూన్ 7న లిబియాలోని సిర్టే నగరంలో జన్మించాడు. 1961లో బెంఘాజీలోని మిలిటరీ కాలేజీలో చేరాడు. శిక్షణ పూర్తయిన తర్వాత లిబియా సైన్యంలో చేరాడు. అనేక ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. గడాఫీ సైన్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజు ఇద్రీస్‌తో విభేదాలు వచ్చాయి. దీంతో గడాఫీ సైన్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బృందంలో చేరాడు. 1969 సెప్టెంబర్ 1న తిరుగుబాటుదారులతో కలిసి గడాఫీ నాటి రాజు ఇద్రిస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

అంతులేని గడాఫీ అరాచకాలు
గడాఫీ అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటీష్ సైనిక స్థావరాలను మూసివేయాలని గడాఫీ ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్‌లో, అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు,  వారందరినీ హత్యచేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుండి బహిష్కరించాడు.

లిబియా ఆర్థిక వ్యవస్థ పతనం
ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతని పతనానికి కారణంగా నిలిచాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. ఫలితంగా జనం అతనిని వెర్రివాడు అని పిలిచేవారు. గడాఫీ ప్రవర్తన కారణంగా లిబియా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది. 

సిర్టేలో గడాఫీ హతం
అనంతరం లిబియా పేరు పలు ఉగ్రవాద దాడులతో ముడిపడి కనిపించింది. 1986లో వెస్ట్ బెర్లిన్ డ్యాన్స్ క్లబ్‌పై జరిగిన బాంబు దాడిలో లిబియా పేరు వినిపించింది. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చర్యలు చేపట్టి, ట్రిపోలీలోని గడాఫీ నివాసంపై దాడి చేశారు. నాటి నుంచి యూఎన్‌ఓ గడాఫీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. నాటో కూటమి కూడా లిబియాపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. జూన్ 2011లో గడాఫీ కేసు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చేరింది. గడాఫీ, అతని కుమారుడు సైఫ్ అల్-ఇస్లాంలకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2011, జూలైలో ప్రపంచంలోని 30 దేశాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. 2011, అక్టోబరు 20న గడ్డాఫీ తన స్వస్థలమైన సిర్టేలో హతమయ్యాడు.

చెలరేగిపోయిన లిబియా నేషనల్ ఆర్మీ
గడాఫీ మరణానంతరం ఐక్యరాజ్యసమితి ‘నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (టీఎన్‌సీ)’ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా ప్రకటించింది. టీఎన్‌సీ 2012లో జనరల్ నేషనల్ కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించింది. దీని తరువాత లిబియాలోని టోబ్రూక్ డిప్యూటీస్ కౌన్సిల్ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ​కోరింది. కాగా 2014 నుండి జనరల్ హఫ్తార్‌కు చెందిన ‘లిబియన్ నేషనల్ ఆర్మీ’  లిబియాలో తన ప్రభావాన్ని పెంచుకుంది. 2016లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో లిబియాలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొన్ని లిబియా గ్రూపులు దానిని అంగీకరించడానికి నిరాకరించాయి. ఇంతలోనే లిబియా రాజధాని ట్రిపోలీని స్వాధీనం చేసుకునేందుకు లిబియా నేషనల్ ఆర్మీ.. విమానాశ్రయంపై దాడి చేసింది. జనరల్ హఫ్తార్ తన సైన్యాన్ని ట్రిపోలీపై దాడి చేయాలని ఆదేశించాడు. ఈ విధంగా అతని సైన్యం..ఇతర సమూహాల మధ్య చాలా కాలంగా 
ఘర్షణ వాతావరణం కొనసాగింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతం
గడాఫీ మరణానంతరం ప్రారంభమైన అంతర్యుద్ధాన్ని సద్వినియోగం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఈ దేశంలోకి ప్రవేశించింది. రాజధాని ట్రిపోలీకి తూర్పున 450 కి.మీ దూరంలో ఉన్న సిర్టే నగరంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ ఊచకోతలకు పాల్పడింది. అయితే 2022లో అక్టోబర్‌లో ఖలీఫా హిఫ్తార్ దళాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతమొందించాయి. 

తాజా వరదల్లో వేలాదిమంది మృతి
తాజాగా లిబియాలోని దర్నాను తాకిన సునామీ తరహా వరద నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ట్రిపోలీలో సంభవించిన వరదల్లో 2,300 మంది మరణించారని చెబుతున్నారు. దర్నాతో సహా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో సంబంధిత అధికారులు 5,300కు  మించిన మృతదేహాలను వెలికితీశాని సమాచారం. కాగా వరదల్లో వేలాది మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 34 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: పాక్‌ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top