కరోనా : ఆ టీకా తీసుకున్న వైద్యుడికి అలర్జీ

Coronavirus : US Doctor Has Severe Allergic Reaction To Moderna Covid Vaccine - Sakshi

బోస్టన్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికి అక్కడ భారీ స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతించింది. ఈ క్రమంలోనే నెలల తరబడి అలుపెరగకుండా కష్టపడిన వైద్య సిబ్బందికి ముందుగా కరోనా టీకాలు అందజేస్తున్నారు. అయితే మోడర్నా వ్యాక్సిన్‌ తీసుకున్న ఒక వైద్యుడిలో అలర్జీ లక్షణాలు కనిపించాయి.  అంతేకాదు అతని గుండె కూడా వేగంగా కొట్టుకున్నట్లు ఆ దేశ ప్రముఖ పత్రిక నూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ప్రచురించింది.

వివరాలు.. అమెరికాలోని బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ హుస్సేన్ సదర్జాదే మోడార్నా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే అతని శరీరంలో అనేక మార్పులు చేసుకున్నాయి. మైకంలోకి వెళ్లడంతో పాటు గుండె కూడా వేగంగా కొట్టుకుంది. దీంతో ఆయన్ని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు తరలించి అక్కడ చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. చికిత్స తీసుకున్నాక డాక్టర్ సదర్జాదే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్ఛార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గత వారం ఎమెర్జెన్సీ ప్రాతిపదికన ఫైజర్ సంస్థకు చెందిన ఫైజర్ అండ్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ పలువురికి ఇవ్వడంతో వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులు చెప్పారు. దీంతో అలెర్జీ రియాక్షన్స్‌పై ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించిన కొద్ది రోజులకే అధికారిక మోడెర్నా వ్యాక్సిన్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top