భారత్‌తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్‌టీఏ: రిషి సునాక్‌

Committed to working quickly on U.K.-India FTA says Rishi Sunak - Sakshi

లండన్‌:  భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్‌ తాజాగా యూకే పార్లమెంట్‌ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్‌ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్‌ ఎంపీలు కోరారు.

ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్‌–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్‌ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు.  భారత్‌–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్‌ తేల్చిచెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top