బ్రిటిష్ హాస్యనటుడు మో గిల్లిగన్ కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘‘బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్‌స్పిరసీ’’ కోసం 28 రోజుల పాటు రోజుకు మూడు పూటలా ఫ్రైడ్ చికెన్ తిన్నాడు. ఆ తర్వాత ఎదురైన ఆందోళనకర పరిణామాలను మో గిల్లిగన్ వివరించాడు.
గిల్లిగన్ 2004లో విడుదలైన సూపర్‌హిట్ డాక్యుమెంటరీ ‘సూపర్ సైజ్ మీ’ నుంచి స్ఫూర్తి పొంది 28 రోజుల పాటు రోజుకు 3 పూటలా ఫాస్ట్‌ఫుడ్ చికెన్ తినేందుకు అంగీకరించాడు. ఆ డాక్యుమెంటరీలో చిత్రనిర్మాత మోర్గాన్ స్పర్లాక్ నెల రోజుల పాటు మెక్‌డొనాల్డ్స్ ఆహారం మాత్రమే తిని, దాని ప్రభావాలను నమోదు చేశాడు.
గిల్లిగన్ ఏం చెప్పాడు?
“నెట్‌ఫ్లిక్స్ నాకు చికెన్ తినడానికి డబ్బులు ఇస్తోందా? ఇది పిచ్చిగా ఉంది కదా అని అనుకున్నాను. వాళ్లు రూపొందించాలనుకున్న సినిమా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. మొదటి కొన్ని నిమిషాల్లో ఇదంతా అద్భుతంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే, ఇది కలల ఉద్యోగంలా అనిపించింది” అని గిల్లిగన్ ‘ఆబ్సెస్డ్: ది పాడ్‌కాస్ట్’ తాజా ఎపిసోడ్‌లో మ్యాట్ విల్‌స్టీన్‌తో చెప్పాడు.

దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని తనకు తెలుసని గిల్లిగన్ చెప్పాడు. అయితే తన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందనే ఆలోచన తన నిద్రను దూరం చేసేంతగా ఆందోళన కలిగించలేదని తెలిపాడు. అయితే, ఈ సవాలు సగానికి చేరుకునే సమయానికి అతడిలో అనేక మార్పులు మొదలయ్యాయి. అవి నిజంగా శారీరకంగా వచ్చిన మార్పులా, లేక తన ఊహ మాత్రమేనా అనేది కూడా అతడికి అర్థం కాలేదు.
ఆరోగ్యం క్షీణించింది..
గిల్లిగన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పాడు. మరో వారం తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తెలిపాడు. బరువు పెరిగిందని, నియంత్రణ లేకుండా చెమటలు పట్టడం మొదలైందని, మానసిక స్థితిలో మార్పులు వచ్చాయని చెప్పాడు. అలాగే అతిగా కునుకులు తీసే అలవాటు ఏర్పడిందని, అవి చాలా లోతైన, తీవ్రమైన నిద్రలా అనిపించేవని వివరించాడు.
“నేను కాఫీతో పాటు చికెన్ తింటున్న దృశ్యం చూస్తే ఇదంతా నిజమా అనిపించింది. నాకు అల్పాహారంగా ఇలా చికెన్ తినాలని లేదు. కాఫీతో కలిసి అస్సలు తినాలని లేదు. సగం దశ బహుశా అన్నింటికంటే కష్టమైనది. ఆహారం తింటున్నప్పుడు దాని రుచి ఇక బాగుండదని అనుకున్నాను. కానీ అది చాలా రుచిగానే ఉంది” అని గిల్లిగన్ చెప్పాడు.
గిల్లిగన్ ఎదుర్కొన్న అనుభవంతో పాటు ఈ డాక్యుమెంటరీ చికెన్ పరిశ్రమను కూడా పరిశీలిస్తుంది. ఫ్రైడ్ చికెన్ చుట్టూ ఉన్న జాతిపరమైన మూసధోరణులు, బ్రిటన్ ఫాస్ట్‌ఫుడ్ రంగానికి సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారిస్తుంది. “ఫ్రైడ్ చికెన్‌కు సంబంధించిన చాలా అంశాలను ఇందులో చూపించడానికి ప్రయత్నించాం. అలాగే పెద్ద చికెన్ పరిశ్రమను కూడా పరిశీలించాం. అక్కడి నుంచే ఈ చిత్రం మరో దిశలోకి మారుతుంది” అని గిల్లిగన్ చెప్పాడు.
“వీలైనన్ని అంశాలను ఇందులో చూపించడానికి మేము నిజంగా ప్రయత్నించాం. ‘అతడి ప్రయాణాన్ని చూస్తాను, అతడికి ఏమి జరుగుతుందో నాకు తెలుస్తుంది’ అనే విధంగా మాత్రమే ఈ చిత్రం ఉండకూడదని భావించాం. ఇంతకుముందు ఎవరో చేసినదాన్ని అనుకరించకుండా, మా చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నించిన విధానం ఇదేనని అనుకుంటున్నాను” అని అతడు చెప్పాడు.


