
చిన్ననాటినుంచే ఎండకు దూరం
డి విటమిన్ లోపంతో పెళుసుబారిన ఎముకలు
మంచంపై అలా కదలగానే విరిగిన వైనం
చైనాలో 48 ఏళ్ల మహిళ వింతగాథ
అసూర్యంపశ్య. అంటే ఎండ కన్నెరగని స్త్రీ. చైనాలో ఓ 48 ఏళ్ల మహిళ ఉదంతమిది. సిచువాన్ ప్రావిన్సులో చెంగ్డూ నగరానికి చెందిన ఆమె తన ఒంటిని ఒక్క సూర్యకిరణం కూడా తాకనిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆరుబయటకు వెళ్లినా ఒళ్లంతా కప్పేలా వ్రస్తాలు ధరించేది. ముఖం, చేతులు బయటకు కనిపించక తప్పని పరిస్థితుల్లో నిండుగా సన్‌స్క్రీమ్ లోషన్ పట్టించి మరీ వెళ్లేది.
ఈమెకు ఉన్న ఈ అలవాటు ఇప్పటిది కాదు. చిన్ననాటి నుంచే ఇదే తంతు. ఎండ తగిలితే కందిపోవడమే గాక నల్లబడతానన్న భయమే ఇందుకు కారణం. అందుకే నిత్యం పొడవాటి టాప్స్ ధరించేది. చలువ కళ్లద్దాలు, సాక్స్, షూ, పొడవాటి చొక్కా.. ఇలా ఏ రకంగానూ సూర్యకాంతి సోకకుండా బహుజాగ్రత్తలు తీసుకుంది. షార్ట్స్, స్లీవ్స్ పొరపాటున కూడా వేసుకునేది కాదు!
అయితే ఏమైంది?
ఒంటికి ఎండ తాకక అత్యావశ్యకమైన ‘డి’విటమిన్ లోపించింది. ఎంతగా అంటే, ఇటీవల ఆమె పడక మంచంపై కాస్త అటూ ఇటూ కదలగానే ఏకంగా ఓ ఎముక విరిగిపోయింది. డి విటమిన్ లోపంతో ఎముకలు గట్టిదనం తగ్గి పెళుసుబారడమే అందుకు కారణం. ఎముక విరగడంతో నరకయాతన నడుమ ఆస్పత్రిలో చేరింది. మెత్తని బెడ్ మీద ఎముక ఎలా విరిగిందని వైద్యులే విస్తుపోయారు.
పరీక్షలన్నీ చేసి, డి విటమిన్ లోపమని తేల్చడమే గాక ఆమెను మందలించారు. బోలు ఎముక వ్యాధిగా పేర్కొనే ఆస్టియోపోరోసిస్ బారినపడ్డట్టు చెప్పారు. లాంగ్ షువాంగ్ అనే సంప్రదాయ వైద్యున్ని ఉటంకిస్తూ సౌత్‌చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ తాజాగా ఈ వింతగాథను బయటపెట్టింది. ఇదిప్పుడు అంతటా పెద్ద చర్చనీయంగా మారడమే గాక సోషల్ మీడియాలోనూ తెగ వైరలైంది.
కీలకమైన విటమిన్
విటమిన్ డి ప్రకృతిలో సహజంగా లభించదు. శరీరమే దాన్ని తయారు చేసుకుంటుంది. అందుకు సూర్యకాంతి అవసరం. ఉదయపు లేత కిరణాల వేడికి చర్మం కింది పొరలోని రసాయనాలు వేడెక్కి డి విటమిన్‌ను తయారు చేసుకుంటాయి. అది ఉంటేనే మన శరీరం అత్యధికంగా కాల్షియంను సంగ్రహించుకోగలదు. కాల్షియం సమపాళ్లలో ఉన్నప్పుడే ఎముకలకు గట్టిదనం వస్తుంది. అవి గట్టిగా ఉంటేనే అన్ని పనులు చక్కగా చేసుకోగలం. కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారతాయి. ఎముక ఆరోగ్యంగా, అస్థిపంజరం పటిష్టంగా ఉండాలంటే ఉదయపు ఎండ తగలాల్సిందే.
చైనాలో విపరీత పోకడ
చైనాలో ఇలా ఎండకు ముఖం చా టేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరుబయటకు వెళ్లినా పేద్ద గొడుగు, చేతులన్నీ కప్పేసేలా దుస్తులు, పెద్ద కళ్లద్దాలు, గ్లౌజ్‌లు, ఫేస్ మాస్క్ లు, కాళ్లకు షూ, అతినీలలోహత కిరణాలను ఆపే హూడీలు... ఇవే ఇప్పుడు చైనాలో ట్రెండ్! ఇలా చేస్తే కాల్షియం సంబంధ వ్యాధులతో ఆస్పత్రిపాలవడం ఖాయ మని వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు.
ఒంట్లో పదేళ్లకోసారి ఎముకలన్నీ కొత్త శక్తితో పునరుజ్జీవం పొందుతాయి. 40 ఏళ్లు దాటాక మాత్రం ఎము కల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత అవి పెళుసుబారతాయి. చక్కటి వ్యాయామం, ఆహారశైలే దానికి విరుగుడని గ్వాంగ్జూ వైద్య విశ్వవిద్యాలయంలో ఆర్థోపెడిక్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జియాంగ్ గ్జియోబింగ్ చెప్పుకొచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్