గల్వాన్‌ ఘటనకు మేం బాధ్యులం కాదు: చైనా

China Tells India Onus of Galwan Clash is Not on Them Embassy Magazine - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడి 20 మంది భారత సైనికుల ప్రాణాలు బలిగొన్న చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ లోయలో ఘర్షణలు తలెత్తడానికి భారత ఆర్మీ చర్యలే కారణమంటూ విషం చిమ్మింది. మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెడాంగ్‌ జూన్‌ 15 నాటి ఘటనకు సంబంధించి చైనీస్‌ ఎంబసీ మ్యాగజీన్‌లో తన అభిప్రాయాన్ని ప్రచురించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.(చైనా తీరును ఖండిస్తూ సెనేట్‌లో తీర్మానం)

‘‘ఈ ఘటనను పూర్తిగా విశ్లేషించినట్లయితే ఇందుకు చైనా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. భారత దళాలే వాస్తవాధీన రేఖను దాటి ముందుకొచ్చి రెచ్చగొట్టడమే గాకుండా చైనా బలగాలపై దాడి చేశాయి. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత బలగాలు పూర్తిగా ఉల్లంఘించాయి. నిబంధనలను తుంగలో తొక్కి అంతర్జాతీయ సంబంధాలకు తూట్లు పొడిచాయి. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపించి, చట్టాలు అతిక్రమించిన ఫ్రంట్‌లైన్‌ బలగాలపై భారత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుని జవాబుదారీగా ఉండేలా చూడాలి. అంతేగాక వారు రెచ్చగొట్టే చర్యలు ఆపినపుడే మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి’’అని సన్‌ వెడాంగ్‌ తన ఆర్టికల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(డ్రాగన్‌ దూకుడు : భారత్‌ దిగుమతులపై సుంకాల పొడిగింపు) 

కాగా జూన్‌ 14 అర్ధరాత్రి డ్రాగన్‌ ఆర్మీ గల్వాన్‌ లోయలో ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతలు సృష్టించిన నేపథ్యంలో భారత ఆర్మీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు అసువులు బాశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పలు దఫాలుగా దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారంతో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో సన్‌ వెడాంగ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు.. గల్వాన్‌ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల వివరాలను చైనా ఇంతవరకు వెల్లడించలేదు. అంతేగాక వారికి కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించిందని అమెరికా ఇంటలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్న విషయం విదితమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top