పాంపియో భారత్‌ పర్యటన.. చైనా స్పందన

China On Mike Pompeo's Visit To India South Asia - Sakshi

బీజింగ్‌: భారత్-అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ సోమవారం భారత్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై డ్రాగన్‌ దేశం స్పందించింది. బీజింగ్‌తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య విబేధాలు రాజేయడం మానుకోవాల్సిందిగా అమెరికాని కోరింది. చైనా బెదిరింపుల నేపథ్యంలో మైక్‌ పాంపీయో, భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో పర్యటించడం గురించి చైనా స్పందన ఏంటని బీజింగ్‌ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ని ప్రశ్నించగా.. చైనాపై ఆరోపణలు చేయడం మైక్‌ పాంపియోకు కొత్త కాదని తెలిపారు. ఆయన పదే పదే వాటిని పునరావృతం చేశాడన్నారు. (చదవండి: అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి)

ఈ సందర్భంగా వాంగ్‌ వెన్బిన్‌ మాట్లాడుతూ.. ‘పాంపియో ఆరోపణలు నిరాధరమైనవి. ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, సైద్ధాంతిక పక్షపాతం భావజాలానికి అతుక్కుపోతున్నట్లు తెలుస్తోంది. కానీ మేం మాత్రం ఆయన ప్రచ్ఛన్న యుద్ధం, జీరో సమ్‌ గేమ్‌ మనస్తత్వాన్ని విడనాడాలని కోరుతున్నాము. చైనా, ప్రాంతీయ దేశాల మధ్య అసమ్మతిని రగల్చడం, శాంతి, స్థిరత్వాలను అణగదొక్కాలని చూస్తున్నారు’ అని మండి పడ్డారు. భారత్‌, అమెరికా రెండు దేశాల మధ్య మైలురాయిగా నిలిచే బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) పై సంతకం చేసిన తర్వాత వాంగ్‌ వెన్బిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బెకా ఉన్నత స్థాయి సైనిక సాంకేతిక పరిజ్ఞానం, వర్గీకృత ఉపగ్రహ డేటా మరియు ఇరు దేశాల మధ్య క్లిష్టమైన సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. (చదవండి: భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు)

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్‌ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్‌ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోన్న సంగతి తెలిసిందే. భారత పర్యటన తరువాత, పాంపియో శ్రీలంక, మాల్దీవులను సందర్శించనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top