Gold Mine Clashes: బంగారం కోసం మైన్‌లో కొట్లాట.. 100 మంది దుర్మరణం

Chad: Gold Miners Killed in Clashes - Sakshi

నద్‌జమేనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో ఘోరం జరిగింది. బంగారు గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. 

లిబియా సరిహద్దులోని కౌరీ బౌగౌడీ జిల్లాలో మే 23, 24 తేదీల్లో  ఈ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను కట్టడి చేయడానికి అక్కడి సైన్యం రంగంలోకి దిగింది.  ప్రస్తుతానికి అక్కడ మైనింగ్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది.

ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. లిబియా నుంచి అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అరబ్స్‌కు, తూర్పు చాద్‌కు చెందిన టమా కమ్యూనిటీకి మధ్య ఈ ఘర్షణలు జరిగినట్లు సమాచారం. అయితే ఘర్షణ చెలరేగడానికి గల ప్రధాన కారణాలు తెలియరాలేదు. బంగారం కోసం ఎగబడి ఉంటారని భావిస్తున్నారు.

చాద్‌.. టెరర్రిజంతో పాటు రెబల్స్‌ గ్రూప్స్‌ దాటికి విలవిలలాడుతోంది. రెబల్స్‌ ఘర్షణల్లోనే అధ్యక్షుడు ఇడ్రిస్‌ డెబీ మరణించగా.. ఆయన కొడుకు మహమత్‌ డెబీ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది అక్కడ.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top