రాజు చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే! | Sakshi
Sakshi News home page

కింగ్‌ చార్లెస్‌ చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే!

Published Mon, May 8 2023 5:35 AM

Britain King Charles 3 under sanctions - Sakshi

బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌ 3 పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక దేశానికి రాజుగా కిరీటధారణ జరిగితే ఇక ప్రతి రోజూ రాజభోగాలు అనుభవించడమే అనుకుంటే పొరపాటే. విందు వినోదాలు, చుట్టూ వందిమాగధులు, ఏ చిన్న పనికైనా జీ హుజూర్‌ అనే సేవకులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరిన్ని ఆంక్షల చట్రంలో బతకాల్సి ఉంటుంది. రాజు ప్రాణం ప్రజలకు ఎంతో విలువైనది.

అందుకే భద్రతా కారణాలు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలతో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పా టించాలి. ఒక రకంగా బంగారు పంజరంలో బంధించినట్టుగా స్వేచ్ఛను కోల్పోవలసి ఉంటుంది. 70 ఏళ్ల క్రితం రాణి ఎలిజæబెత్‌ నాటి నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కింగ్‌ చార్లెస్‌ అవి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించి తీరవలసిందే.

కానుకల స్వీకరణ తప్పనిసరి  
బ్రిటన్‌ రాజ సంప్రదాయం ప్రకారం వారికొచ్చే కానుకల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఇతర దేశాల పర్యటనలకి వెళ్లినప్పుడు రాజుపై గౌరవంతో చాలా మంది రకరకాల కానుకలు ఇస్తారు. వాటిని రాజు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ ఆ కానుకలు ఏదైనా ప్రత్యుపకారం పొందడం కోసం ఇస్తూ ఉంటే మాత్రం రాజకుటుంబం వారు కానుకల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి.  



విలియంతో ప్రయాణించలేరు
బ్రిటన్‌ రాజుతో పాటు వారసుడు కూడా ము ఖ్యమే. కింగ్‌ చార్లెస్‌ తర్వాత సింçహాసనం అధిష్టించే వారసత్వపు హక్కు కలిగిన ప్రిన్స్‌ విలి యమ్‌తో కలిసి ఆయన ఎక్కడికీ ప్రయాణించకూడదు. ఇద్దరూ వేర్వేరు విమానాలు, వాహనాల్లోనే వెళ్లాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్న భావనతో ఈ నిబంధన తీసుకువచ్చారు.  



వస్త్రధారణ
రాజు ధరించే వస్త్రధారణకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దౌత్యపరంగా అనుకూలంగా ఉండే డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఉంటుంది. రాజు ఏ దేశానికి వెళితే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులే ధరిస్తారు. ఇక రాజు తనతో పాటు ఎప్పుడూ నలుపు రంగు వస్త్రాలు తీసుకువెళతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంత్యక్రియలకి హాజరుకావాల్సి వస్తే అప్పుడు వేసుకోవడం కోసం నల్ల బట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.   

షెల్‌ ఫిష్‌ తినలేరు  
రాజుతో సహా బ్రిటన్‌ రాచకుటుంబీలు అందరూ షెల్‌ఫిష్‌కు దూరంగా ఉండాలి. ఫుడ్‌ పాయిజనింగ్‌కి అవకాశం ఉన్న తినకూడదన్న నిబంధనలైతే ఉన్నాయి. ఇక రాజు భద్రతే అత్యంత కీలకం
కాబట్టి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ  తినకూడదు.



ఓటుకి దూరం  
బ్రిటన్‌ రాజు ఎప్పుడూ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకూడదు. అయితే పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్నప్పటికీ రాచ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఓటింగ్‌కి కూడా దూరంగా ఉంటారు.  



డ్రైవింగ్‌ లైసెన్స్‌ అక్కర్లేదు
ఎన్ని రకాల ఆంక్షలున్నా బ్రిటన్‌ రాజు ఒక్కరికే ఉన్న సదుపాయం ఒకటుంది. అదే లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం. కారు డ్రైవ్‌ చేయాలని అనుకుంటే ఆయనకు లైసెన్స్‌ అక్కర్లేదు. పాస్‌పోర్ట్‌ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు.



సెల్ఫీలు ఆటోగ్రాఫ్‌లు ఉండవు
ప్రజలెవరైనా రాజుతో కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చట పడితే అది కుదిరేపని కాదు. ఎవరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అలా ఇస్తే రాజు సంతకం ఫోర్జరీ చేస్తారన్న భయం ఉంది. సెల్ఫీలు దిగకూడదు. రాజు కుటుంబ సభ్యులందరికీ ఇదే వర్తిస్తుంది. అయితే ప్రోటోకాల్స్‌లో ఈ నిబంధనని అధికారికంగా ఇంకా చేర్చలేదు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement