
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంతానమైన హంటర్ బైడెన్, ఆష్లే బైడెన్‌లకు సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపును తక్షణమే అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో జో బైడెన్ తన పిల్లలకు ఈ భద్రతా సౌకర్యాన్ని కల్పించారు.
ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన హంటర్ బైడెన్‌కు 18 మంది ఏజెంట్ల భద్రత కల్పించారని ట్రంప్ ఆరోపించారు. అలాగే ఆష్లే బైడెన్ భద్రత కోసం 13 మంది ఏజెంట్ల భద్రత కల్పించారన్నారు. అయితే హంటర్ బైడెన్(Hunter Biden)కు ఇకపై సీక్రెట్ సర్వీస్ రక్షణ కల్పించబోమని, యాష్లే బైడెన్‌ను కూడా భద్రతా జాబితా నుండి తొలగించనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం గురించి తమకు తెలుసని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ దీనికి కట్టుబడి ఉంటుంది. వీలైనంత త్వరగా ట్రంప్ నిర్ణయాన్ని అమలు చేయడానికి వైట్ హౌస్ సిద్ధమయ్యిందని అన్నారు. అమెరికా సమాఖ్య చట్టం ప్రకారం మాజీ అధ్యక్షులు, వారి జీవిత భాగస్వాములు జీవితాంతం సీక్రెట్ సర్వీస్ రక్షణను పొందుతారు.
ఇది కూడా చదవండి: యెమెన్‌పై మరోమారు అమెరికా దాడి