బుల్లిపిట్ట.. ప్రపంచ రికార్డు.. నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్ల ప్రయాణం

Bar Tailed Godwit Breaks World Record Journey From Alaska To Australia - Sakshi

ఒక బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. విశ్రాంతి, ఆహారం లేకుండా నాన్‌స్టాప్‌గా 11 రోజులు ప్రయాణించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. లిమోసా ల్యాపోనికా జాతికి చెందిన బార్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్‌ అనే చిన్న పక్షి అమెరికాలోని అలాస్కా వద్ద నోమ్‌ తీరం నుంచి గతేడాది అక్టోబర్‌ 13న బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వద్ద ఆన్‌సాన్స్‌ తీరం వరకు ప్రయాణించి ఈ రికార్డు సాధించింది.
– సాక్షి, అమరావతి

బహుదూరపు ప్రయాణానికి సిద్ధమైందిలా.. 
అలాస్కాలో బార్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్‌ జాతికి చెందిన వలస పక్షులు (చిన్న వాటికి) మూడింటికి గతేడాది అక్టోబర్‌లో మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆర్నిథాలజీ సైంటిస్టులు తమ బర్డ్‌ ట్రాకింగ్‌ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రాముల బరువుండే సోలార్‌ శాటిలైట్‌ ట్రాన్స్‌మిటర్లను అమర్చారు. ఐదు నెలల వయసున్న బీ6 (పక్షికి సైంటిస్టులు పెట్టిన పేరు) కూడా అందులో ఉం­ది. అయితే వలస వెళ్లిన మిగిలిన రెండు పక్షుల జాడ తెలియలేదు.

కాగా, వలసకు సమయం ఆసన్నమైన తరుణంలో ఆ పక్షులు త­మ శరీరాన్ని ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అ­నవసరమైన బరువును తగ్గించేందుకు జీర్ణ వ్యవస్థ సహా కొన్ని అవయవాలను కుదించు­కున్నాయి. శక్తిని ఆదా చేసేందుకు తక్కువ పీడనం ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్న గాలు­లు వీ­చే వరకు ఎ­దు­రు చూశా­యి. అన్నీ అనుకూలం­గా మారి­న తర్వా­­త ఎగరడం ప్రా­రం­­భిం­­చాయి.

ఆడ పక్షులే పెద్దవి.. 
► బార్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్‌ల రెక్కలు పెద్దగా విప్పి ఎగురుతాయి.  
► నీటిపై తేలేందుకు వీలుగా వీటి శరీర అమరిక ఉండదు కాబట్టి సముద్రంలో విశ్రాంతి కోసం ఆగలేవు.  
► ఈ పక్షులు 37 నుంచి 41 సెంటీమీటర్ల పొడవుంటాయి.  
► మగ పక్షుల కంటే ఆడ పక్షులు పెద్దవిగా ఉంటాయి. మగవి 190 నుంచి 400 గ్రాములు, ఆడవి 260 నుంచి 630 గ్రాముల వరకు బరువు ఉంటాయి. 
► ఇవి సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి ప్రాంతాల్లో వేట సాగిస్తూ.. నీటి పురుగులు, నత్తల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి.

బీ6 ప్రయాణమిలా.. 
ఇది తొలుత హవా­యికి పశ్చిమ దిశగా ఎగరడం ప్రారంభించింది.  
అక్టోబర్‌ 19న పసిఫిక్‌ ద్వీప దేశమైన కిరి­బాటి మీదుగా ప్రయాణించింది. 
దాదాపు రెండు రోజుల తర్వాత సిడ్నీకి దగ్గరగా ఎగిరింది.  
న్యూజిలాండ్‌ మీదుగా అక్టోబర్‌ 25న టాస్మానియా తీరానికి చేరింది.  
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది.  
అంతదూరం ఈ చిన్న పక్షి ఒంటరిగా ప్రయాణించిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు.  
అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  
ఒక వయసుకు రాగానే సాధారణంగా ఈ జాతి పక్షులు గుంపుగా బయలుదేరి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వైపుకు వలస వెళుతుంటాయి.  
కానీ ఇప్పుడు తక్కువ వయసున్న పక్షులు పెద్ద పక్షుల నుంచి విడిపోయి దక్షిణ దిశగా సుదూరంగా ప్రయాణించాయి.    
2020లో ఇదే జాతికి చెందిన ఓ పక్షి అలస్కా నుంచి న్యూజిలాండ్‌ వరకు 12,200 కి.మీ. ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top