
మెల్‌బోర్న్(ఆస్ట్రేలియా): మంటను ముట్టుకుంటే కాలిపోతుంది. మంచును టచ్ చేస్తే చల్లగా ఉంటుంది. కానీ ఈ ఆ్రస్టేలియా వ్యక్తికి మాత్రం నిప్పు చల్లగా ఉంటుంది. చల్లని పదార్థం చురుక్కుమటుంది. అదెలా సాధ్యమంటే, అదో వింత వ్యాధి. అతని కాళ్లు, చేతులు గ్రహణ శక్తి కోల్పోయాయి. ఈ వ్యాధితో అతను ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్నో పరీక్షలు చేసినా వ్యాధేమిటో తెలిసింది కానీ చికిత్స ఏమిటో తెలియడం లేదు.
ఆ్రస్టేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్ మెక్‌మానస్ 17వ ఏట హైస్కూల్ చివరి ఏడాదిలో ఉండగా ఈ సమస్య మొదలైంది. పాదాల్లో కొద్దికొద్దిగా అనుభూతిని కోల్పోవడం మొదలైంది. పాదాలు చక్కిలిగింతలు పెట్టినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్తం, ఇతర ద్రవాల సరఫరా లేదంటూ డాక్టర్ మందులిచ్చాడు. అవేవీ పని చేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా రక్త పరీక్షలు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధీ నిర్ధారణ కాలేదు. చివరకు అతను ఆక్సోనల్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది శరీరానికి సంకేతాలను ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది.
దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకున్నప్పుడు, చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న అనుభూతిని పొందుతాడని తల్లి ఏంజిలా మెక్‌మానస్ వాపోయారు. అతని రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. నడక సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమతుల్యత, సమన్వయం తగ్గుతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్సను భరించలేమని నేషనల్ డిజేబులిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ (ఎన్‌డీఐఏ) సైతం చేతులెత్తేసింది. చికిత్సేమిటో తెలియకుండా నిధులివ్వలేమని తేల్చేసింది. కానీ నొప్పి నివారణ మందులు తప్ప ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుబాటులో లేదని న్యూరాలజిస్ట్ చెప్పుకొచ్చారు. పరిస్థితి నానాటికి దిగజారిపోయే పరిస్థితి ఉంది గనుక ఎన్‌డీఐఏలో చేర్చాలంటూ ఏజెన్సీకి లేఖ రాశారు.