Astrophotographer Captures Rare Event As Star Explodes And Disappears - Sakshi
Sakshi News home page

కెమెరా కంటికి చిక్కిన సూపర్‌నోవా

Published Tue, May 23 2023 4:40 AM

Astrophotographer captures rare event as star explodes and disappears - Sakshi

సువిశాలమైన అంతరిక్షం.. ఎన్నెన్నో విశేషాలకు ఆలవాలం. అంతరిక్షంలోని కోటాను కోట్ల నక్షత్రాల్లో కొన్ని అంతరించిపోతుంటాయి. తారల జీవితకాలం ముగియగానే వాటిలోని ఇంధనం మండిపోయి, అదృశ్యమైపోతుంటాయి. చివరి దశకు వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఎలా ఉంటుంది? అంతమయ్యే ముందు ఏం జరుగుతుంది? నక్షత్రాలు మృత తారలుగా మారడానికి ముందు పరిణామాలేంటి? ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తి ఉన్నప్పటికీ మన కంటికి కనిపించవు.

నక్షత్రాలు మన భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడమే ఇందుకు కారణం. తారల కేంద్ర భాగం(కోర్‌)లో అణు విచ్ఛిత్తి జరిగి పేలిపోతుంటాయి. నక్షత్రాలు పేలిపోయి, అంతం కావడాన్ని సూపర్‌నోవా అంటారు. ఇలాంటి ఒక సూపర్‌నోవాను ప్రముఖ అస్ట్రో ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ మెక్‌కార్తీ తన కెమెరాలో చక్కగా బంధించారు. పిన్‌వీల్‌ లేదా ఎం10 అనే పాలపుంత(గెలాక్సీ)ని ఆయన తన టెలిస్కోప్‌తో నిశితంగా పరిశీలించారు.

ఆ పాలపుంతలో కాలం తీరిన ఒక నక్షత్రం పేలిపోయి, అంతమైపోవడాన్ని టెలిస్కోప్‌ ద్వారా కొన్ని ఫ్రేమ్‌లను తన కెమెరాలో బంధించి, దృశ్యబద్ధం చేశారు. దీన్ని ఒక యానిమేషన్‌గా మార్చారు. మృత నక్షత్రాన్ని చిత్రీకరించడానికి ఆ గెలాక్సీకి సంబంధించిన కలర్‌ డేటాను ఉపయోగించానని ఆండ్రూ మెక్‌కార్తీ చెప్పారు. నక్షత్రానికి చెందిన 10 నిమిషాల ఎక్సపోజర్‌తో యానిమేషన్‌ రూపొందించినట్లు తెలిపారు. ఎరుపు, తెలుపు వర్ణాలతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.

మరో విశేషం ఏమిటంటే.. సూర్యుడు తన జీవితకాలమంతా వెలువరించే శక్తి కంటే ఎక్కువ శక్తి కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సంభవించే సూపర్‌నోవాలో వెలువడుతుందట! కాంతి, వేడి, రేడియేషన్‌ రూపంలో ఈ శక్తి ఉద్గారమవుతుంది. సూపర్‌నోవా గాఢమైన ప్రభావం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పిన్‌వీల్‌(ఎం10) పాలపుంత(మిల్కీవే) ప్రస్తుతం మనం ఉంటున్న పాలపుంత కంటే 70 శాతం పెద్దది. దాని వ్యాసం 1,70,000 కాంతి సంవత్సరాలు. మన భూమి నుంచి 21 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.   

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement