నాటు నాటుకి అమెరికన్‌ యువత స్టెప్పులు | Sakshi
Sakshi News home page

నాటు నాటుకి అమెరికన్‌ యువత స్టెప్పులు

Published Sat, Jun 24 2023 5:32 AM

Americans dancing to tunes of Naatu Naatu in Modi State Dinner - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఏర్పాటు చేసిన అధికారిక విందు సరదా సంభాషణలతో సందడిగా సాగింది. వైట్‌హౌస్‌ నార్త్‌ లాన్‌లో గురువారం రాత్రి ఈ విందుకు 400 మందికిపైగా అతిథుల్ని ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలు ముకేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహేంద్ర, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తదితరులు ఈ విందుకి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ విందులో అధ్యక్షుడు బైడెన్‌ ప్రధాని మోదీతో సరదా సంభాషణలతో నవ్వులు పూయించారు.

విందులో టోస్ట్‌ (ఆరోగ్యం కోసం తీసుకునే ఒక పెగ్గు ఆల్కహాల్‌) సంప్రదాయం గురించి బైడెన్‌ మాట్లాడుతూ ‘‘మిస్టర్‌ పీఎం మీరు ఎవరికైనా టోస్ట్‌ అందించాలనుకుంటే మీ చేతి గ్లాసులో ఆల్కహాల్‌ లేకపోతే ఎడమ చేత్తో వారికి ఇవ్వాలి. ఈ విషయాన్ని మా తాతయ్య చెప్పేవారు’ అని బైడెన్‌ అంటే మోదీ చిరునవ్వులు చిందించారు. బైడెన్, మోదీ ఇద్దరూ ఆల్కహాల్‌ తీసుకోరు. దీంతో అందరూ ఫక్కున నవ్వేశారు. బైడెన్‌ ఆతిథ్యానికి అతిథులందరూ ఫిదా అయిపోయి పాటలు పాడాలని అనుకుంటారని మోదీ అన్నారు.

2014లో అమెరికాకు వచ్చినప్పుడు నవరాత్రుల సందర్భంగా ఉపవాసం ఉండడంతో ఏమీ తినలేదని, అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‌ తనని బాగా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. తాను తినాలన్న బైడెన్‌ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. అతిధులందరూ ఆరోగ్యం కోసం ఆల్కహాల్‌ తీసుకోవాలంటూ మోదీ స్వయంగా టోస్ట్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికా మధ్య బంధాల బలోపేతంలో ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ‘భారతీయులు, అమెరికన్లు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుంటున్నారు. భారత్‌లో పిల్లలు హాలోవిన్‌ వేడుకల్ని చేసుకుంటూ స్పైడర్‌ మ్యాన్‌ను చూసి పులకించిపోతూ ఉంటే, అమెరికన్‌ యువత తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకి స్టెప్పులేస్తున్నారు’అని ప్రధాని పేర్కొన్నారు.

అధికారిక విందులో మెనూ..!
ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహారం, తృణధాన్యాలతో చేసిన వంటలను దగ్గరుండి మరీ జిల్‌ బైడెన్‌ వడ్డించారు. మారినేటెడ్‌ మిల్లెట్స్, గ్రిల్డ్‌ మొక్కజొన్న సలాడ్, పుచ్చకాయ జ్యూస్, అవకాడో సాస్, స్టఫ్‌డ్‌ మష్‌రూమ్స్, క్రీమీ రిసొట్టో, లెమన్‌ డిల్‌ యోగర్ట్‌ సాస్‌ వంటివి ప్రత్యేకంగా వడ్డించారు.

Advertisement
 
Advertisement