వైరల్‌: కారు, బైక్‌ కాదు.. ఇంటింటికీ విమానాలే!

Airparks Converted Into Flying Communities - Sakshi

వాషింగ్టన్‌: మీకు ఎప్పుడైనా అనిపించిందా..! ఒక సొంత విమానం ఉంటే బాగుంటుంది అని. అలా ఎప్పుడైనా ఆలోచించారా. ఊరుకోండి మాస్టారు.. విమానంలో ప్రయాణించడమే  గొప్ప ఇంకా సొంత విమానమే! అని మనసులో తిట్టుకుంటున్నారా. చాలా మందికి సొంత వాహనం ఉండటమే ఒక కల. కొంత మందికి ఆ కల కలగానే ఉండిపోతుంది. మరికొంత మంది అప్పో సోప్పో చేసైనా ఆ కలను నిజం చేసుకుంటారు. 

ఇంకొంత మంది సొంత వాహనం కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పటికీ పార్కింగ్‌ స్థలం లేక ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. ఇక సొంత వాహనం లేనివారు  సింపుల్‌గా బస్సుల్లోనో, ఆటోల్లోనో ప్రయాణాలు సాగిస్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన సియెర్రా ప్రాంతంలో నివసించేవారు అలా కాదు.. వారి ఇళ్ల ముందు విమానాలు పార్క్‌ చేసి దర్శనమిస్తాయి. ప్రతి ఇంటికి ఒక విమానం ఉండటం విశేషం. ఇక్కడ నివసించేవారందరూ విమాన పైలట్లే. ఇలా సొంతంగా విమానాలు, రన్‌వే కలిగిన ప్రాంతాలను  ఎయిర్‌ పార్క్‌లని అంటారు.

అసలు ఇంటింటీకీ విమానాల గోల ఏంటండీ
మొదటి ప్రపంచం యుద్ధంతో పోల్చితే రెండో ప్రపంచయుద్ధం  ఎంతగానో ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. దీనికి ముఖ్యకారణం యుద్ధరంగంలోనికి విమానాలు ప్రవేశించడం. యుద్ధంలో పాల్గొన్న దేశాలకు ప్రాణ నష్టంతో పాటు, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విమానాల రాకతో  వాటిని సురక్షితంగా భద్రపర్చడానికి తగిన స్థలం అవసరమయ్యేది. ఈ ప్రాంతాలే కాలక్రమేణా ఎయిర్‌ పార్క్‌లుగా, ఫ్లైయింగ్‌ కమ్యూనిటీలుగా మారాయి. 1939-1946 మధ్యకాలంలో పైలట్ల సంఖ్య 34,000 నుంచి 4,00,000 కు గణనీయంగా పెరిగింది.   మొదటి ఎయిర్‌పార్క్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలోని సియెర్రా స్కై పార్క్. ఇది 1946 లో స్థాపించబడింది.

ఇక్కడ నివసించే ప్రజలు విమానాలను సాధారణ ప్రయాణానికి ఉపయోగిస్తారు. ఇది ఇక్కడ సర్వసాధారణం. ప్రపంచంలో 630 కి పైగా రెసిడెన్షియల్ ఎయిర్‌పార్క్‌లు ఉన్నాయి. వాటిలో 610 కంటే ఎక్కువ యుఎస్‌లో ఉన్నాయి. కొన్ని ఎయిర్‌పార్క్‌లు, పెద్ద ఫ్లై-ఇన్ కమ్యూనిటీలు.. రెస్టారెంట్లు, షాపులు, క్రీడా సౌకర్యాలు, కంట్రీ క్లబ్‌లను కూడా కలిగి ఉన్నాయి. సియెర్రాలోని ఎయిర్‌పార్క్‌లకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. కొసమెరుపు.. మీరు సియెర్రాకు వెళ్లాలంటే కష్టమే. ఎందుకంటే అక్కడ నివసించే పైలట్లకు మీరు బంధువులైన కావాలి, లేదా స్వయంగా పైలట్‌ అయి ఉండాలి.

(చదవండి: అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్‌ కార్‌ టీజర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top