
ఆఫ్రికాఖండం(Africa) పేరు వినగానే మనకు వలసవాదం, వర్ణవిక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు గుర్తుకువస్తాయి. ఆఫ్రికాలో విభిన్న సంస్కృతులు, భాషలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడి చరిత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు(మే 25) ఆఫ్రికా దినోత్సవం. ఈ సందర్బంగా ఈ ఖండానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్రికా ఖండంలోని విభిన్న సంస్కృతులు, చరిత్ర, విజయాలను గుర్తు చేసుకునేందుకు ప్రతియేటా మే 25న ఆఫ్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1963 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ (ఓఏయూ) స్థాపనకు సూచికగా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిని ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్(African Union) (ఏయూ)గా పిలుస్తున్నారు. ఈ సంస్థ 2002, జూలై 9న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆఫ్రికన్ యూనియన్‌గా రూపాంతరం చెందింది. ఈ రోజు ఆఫ్రికా అంతటా సెలవు దినం. ఆఫ్రికన్ దేశాల ఐక్యత, సామాజిక-ఆర్థిక పురోగతి, సమిష్టి ఆకాంక్షలను ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది.
ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన ఖండంగా ఆఫ్రికా ప్రసిద్ధి చెందింది. ఆఫ్రికాలో మొత్తం 54 దేశాలు ఉన్నాయి. ఈ ఖండంలో దాదాపు రెండు వేల భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ప్రపంచంలోని మూడొంతులు భాషలు ఈ ఖండంలోనే కనిపిస్తాయి. హావర్డ్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని దాదాపు మూడింట ఒక వంతు భాషలకు ఆఫ్రికా నిలయంగా ఉంది. నేడు ఆఫ్రికా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఆఫ్రికన్ ఐక్యతను ప్రోత్సహించేందుకు, ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు నేడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్ లాంటి నగరాల్లో ఆఫ్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్