Taliban: అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కూడా కవర్లా?

Afghanistan Shopkeepers Cover Female Mannequins Faces Taliban - Sakshi

కాబూల్‌: 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచక పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాస్తోంది. వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తూ అణగదొక్కుతోంది. అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోకుండా నిషేధం విధించింది. జిమ్‌లు, పార్కులకు వెళ్లకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా తాలిబన్లు తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఇప్పటివరకు అమ్మాయిలపై ఆంక్షలు విధించిన తాలిబన్ సర్కార్.. తాజాగా ఆడ బొమ్మలపై కూడా వివక్ష చూపుతోంది. వస్త్ర దుకాణాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే అమ్మాయిల బొమ్మల మొహాలు కన్పించొద్దని ఆదేశించింది. ఈ మేరకు దుకాణ యజమానులకు హుకుం జారీ చేసింది.
దీంతో షాపింగ్ మాల్స్‌లోని అమ్మాయిల బొమ్మల మొహాలకు వస్త్రం లేదా పాలిథీన్ కవర్లను కట్టారు యజమానులు. ఆడ బొమ్మల మొహాలు కన్పించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్ల నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మొదట అసలు షాపింగ్ మాల్స్‌లో అమ్మాయిల బొమ్మలను పూర్తిగా తొలగించాలని, లేదా వాళ్ల మొహాలను తీసేయాలని తాలిబన్లు ఆదేశించారని దుకాణ యజమానులు వాపోయారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని మొహాలు కన్పించకుండా కవర్లు చుట్టాలని చెప్పారని వివరించారు. దీంతో తాము కొన్ని బొమ్మలకు వాటి దస్తులకు మ్యాచ్‌ అయ్యే వస్త్రాన్ని కట్టామని, మరి కొన్నింటింకి స్కార్ఫ్, లేదా పాలిథీన్ కవర్లు చుట్టామని చెబుతున్నారు.
షాపింగ్ మాల్స్‌లో ఆడ బొమ్మల మొహాలకు కవర్లు చుట్టిన ఫొటోలను అఫ్గాన్ మానవతావాది సారా వాహేది ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అవి కాసేపట్లోనే వైరల్‌గా మారాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల జీవితం ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు ఈ ఫొటోలే నిదర్శనమని ఆమె అ‍న్నారు. ఇది అత్యంత బాధాకరం అని ఓ నెటిజన్ స్పందించాడు. తాలిబన్లు నీచులంటూ మరొకరు మండిపడ్డారు.

చదవండి: సీట్‌ బెల్ట్‌ వివాదం.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top