
కాబూల్: అందరినీ భయపెట్టే తాలిబన్లకే వణుకుపుట్టించే పంజ్‌షీర్ లోయ కేంద్రంగా తాలిబన్లపై తిరుగుబాటు సన్నాహాలు జరుగుతున్నాయి. కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న మూడు నగరాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రక్రియలో 60 మంది తాలిబన్ సైనికులు గాయపడడం లేదా మరణించడం జరిగిందని అఫ్గాన్ తిరుగుబాటు వర్గాలు ప్రకటించాయి. అఫ్గాన్ మాజీ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మొహ్మది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘తిరుగుబాటు బతికే ఉంది’’ అని, పుల్ ఎ హెసర్, డె ఎ సలాహ్, బను జిల్లాల్లో పోరాటం చేస్తున్నామని పంజ్‌షీర్ ప్రావిన్స్ పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్ ప్రకటించింది. అఫ్గాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంటోంది. ప్రస్తుతం ఇక్కడ తాలిబన్ వ్యతిరేక శక్తులు ఏకమౌతున్నట్లు తెలుస్తోంది. బను, హెసర్, సలాహ్ ప్రాంతాలు తాలిబన్ల చేతిలో నుంచి జారిపోయినట్లు తెలిసిందని ఇరాన్ జర్నలిస్టు తాజుద్దీన్ సౌరోష్ చెప్పారు.
ఏమిటీ పంజ్‌షీర్?
హిందూకుష్ పర్వత శ్రేణుల్లో కాబుల్‌కు ఉత్తరంగా పంజ్‌షీర్ ప్రావిన్స్ ఉంది. ఈ లోయ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షీర్ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. 11వ శతాబ్దంలో ఒకమారు వచ్చిన వరద నీటిని అడ్డుకొనేందుకు ఐదుగురు సోదరులు ప్రయత్నించడంతో ఈ ప్రాంతానికి పంజ్‌షీర్ అని పేరువచ్చింది. పేరుకు తగ్గట్టే అక్కడి ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలకపాత్ర. అక్కడి ప్రజలను తాలిబన్లకు వ్యతిరేకంగా నడిపించడంలో అహ్మద్ షా మసూద్ కీలక పాత్ర పోషించారు. 1970–80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంలో మసూద్ ముందున్నారు. తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరులుగా వచ్చి 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.