అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబార సిబ్బందిపై  కాల్పులు, ఇద్దరు మృతి | 2 Israeli Embassy Staff Shot And Killed Outside Jewish Museum In Washington, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబార సిబ్బందిపై  కాల్పులు, ఇద్దరు మృతి

May 23 2025 5:03 AM | Updated on May 23 2025 11:56 AM

2 Israeli Embassy staff shot and killed outside Jewish Museum in Washington

నీచమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన ఇజ్రాయెల్‌ 

ఖండించిన అమెరికా 

వాషింగ్టన్‌: అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబార సిబ్బంది ఇద్దరు హత్యకు గురయ్యారు. నార్త్‌ వెస్ట్‌ డీసీలోని యూదుల మ్యూజియానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో రాయబార సిబ్బంది అయిన సారా లిన్‌ మిల్‌గ్రిమ్, యారోన్‌ లిచిన్‌స్కీ అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికన్‌ యూదు అసోసియేషన్‌ ఇచ్చిన విందు నుంచి తిరిగి వెళ్తుండగా కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల అనంతరం నిందితుడు మ్యూజియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈవెంట్‌ సెక్యూరిటీ అతడిని వెంటనే అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో ‘ఫ్రీ పాలస్తీనా’ అని నినాదాలు చేశాడు. 

నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్‌ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కాల్పుల్లో మరణించిన లిచిన్‌స్కీ రాయబార కార్యాలయంలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ కాగా, మిల్‌గ్రిమ్‌.. ఇజ్రాయెల్‌ ఎంబసీలో పనిచేస్తున్న అమెరికా పౌరురాలు. వారిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారని అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబారి యెచియల్‌ లెయిటర్‌ తెలిపారు. వచ్చేవారం జెరూసలేంలో సారాకి ప్రపోజ్‌ చేయాలని యారోన్‌ ప్లాన్‌ చేసుకున్నారని, ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నీచమైన ఉగ్రవాద చర్య: నెతన్యాహు
ఈ దాడిని అమెరికా, ఇజ్రాయెల్‌ నేతలు, అధికారులు ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదేశించారు. ఈ దాడిని యూదు వ్యతిరేక, నీచమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. యువ జంటను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌ రాయబార సిబ్బందిపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖండించారు. ‘యూదు వ్యతిరేకతతో చేసిన హత్యలని స్పష్టమవుతోంది. ఇలాంటి హత్యలు ఇప్పుడే అంతం కావాలి. ద్వేషం, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదు.

 బాధితుల కుటుంబాలకు నా సంతాపం. ఇలాంటివి జరగడం చాలా విచారకరం’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సిబ్బంది హత్యను మేమూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పిరికితనం. యూదు వ్యతిరేక హింస. బాధ్యులను గుర్తించి న్యాయం ముందు నెలబడతాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌ ప్రతినిధులు నిరంతరం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని, అయినా ఇజ్రాయెల్‌ ఉగ్రవాదానికి లొంగిపోదని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియన్‌ సార్‌ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement