
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన నిఘా ఆధారిత ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7-8 మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఇంకావున్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొంది. నిషేధిత టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోని భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్‌ఎస్‌ఎస్) తాజా గణాంకాల ప్రకారం 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక ఘటనల్లో 221కు పైగా జనం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పోరస్ సరిహద్దులను పంచుకునే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాయి.