డిమెన్షియా డేంజర్ బెల్స్

10 million people over the age of 60 likely to have dementia - Sakshi

60ఏళ్ల వయసు పైబడిన వారిలో కోటిమందికిపైగా బాధితులు 

తొలిసారిగా కృత్రిమ మేథ సాయంతో భారత్‌లో అధ్యయనం

ఢిల్లీ ఎయిమ్స్‌ సహా అంతర్జాతీయ యూనివర్సిటీల సంయుక్త అధ్యయనం  

డిమెన్షియా. మన దేశాన్ని కొత్తగా ఈ వ్యాధి పట్టిపీడిస్తోంది. వాస్తవానికి దీనిని పూర్తిగా వ్యాధి అని కూడా అనలేం. ఇదొక మానసిక స్థితి. వయసు మీద పడిన వారిలో డిమెన్షియా లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనలు లేకుండా స్తబ్దుగా ఉండిపోవడం, రీజనింగ్‌ కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి మానసిక సమస్యలు ఎవరిలోనైనా కనిపిస్తే దానిని డిమెన్షియా అని పిలుస్తారు.

ఈ డిమెన్షియా కేసులపై మొట్టమొదటిసారిగా మన దేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఒక అధ్యయనం నిర్వహించారు. అంతర్జాతీయ బృందం భారత్‌లో 31,477 మంది వృద్ధులకి సెమీ సూరప్‌వైజ్‌డ్‌ మిషన్‌ సహకారంతో పరీక్షలు నిర్వహించి ఈ అధ్యయనం చేపట్టింది. యూకేలో యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్, న్యూఢిల్లీలో ఎయిమ్స్‌కు చెందిన పరిశోధనకారులు కృత్రిమ మేధ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

ఈ అధ్యయనంలో అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలతో సరిసమానమైన డిమెన్షియా కేసులు భారత్‌లో కూడా బయటపడడం ఆందోళనకరంగా మారింది. దీనికి సంబంధించిన నివేదికను న్యూరో ఎపిడిమాలజీ జర్నల్‌ ప్రచురించింది. దేశంలో 60 ఏళ్ల కంటే పైబడినవారిలో 8.44% మంది అంటే కోటి 8 లక్షల మంది డిమెన్షియాతో బాధపడుతున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడైంది.

2050 నాటికి డిమెన్షియా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతాయని, ఆ సమయానికి దేశ జనాభాలో 19.1శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారి ఉంటారని వారిలో డిమెన్షియా ముప్పు తీవ్రంగా ఉంటుందని ఆ నివేదిక వివరించింది. గతంలో భావించిన దాని కంటే ఈ వ్యాధి వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉందని తేలింది. డిమెన్షియాకు ప్రస్తుతానికైతే చికిత్స లేదు. కొన్ని మందుల వల్ల లక్షణాలన్ని కొంతవరకు తగ్గించగలుగుతారు. వృద్ధాప్యంలో డిమెన్షియా రాకుండా యుక్త వయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు.  

కశ్మీర్‌లో అధికం
మన దేశంలో జమ్మూకశ్మీర్‌లో అత్యధికులు డిమెన్షియాతో బాధపడుతున్నారు. కశ్మీర్‌లోని 60 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్నవారిలో 11% మందికి డిమెన్షియా ఉంది. ఇక ఢిల్లీలో తక్కువగా 4.5% మందిలో ఈ లక్షణాలున్నాయి.  

డిమెన్షియా అంటే...?  
డిమెన్షియా అన్న పదం డి, మెంటియా అనే పదాల నుంచి వచ్చింది. డి అంటే వితౌట్‌ అని, మెంటియా అంటే మనసు అని అర్థం. డిమెన్షియా అనేది సోకితే రోజువారీ చేసే పనులకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొద్ది సేపటి క్రితం ఏం చేశారో వారికి గుర్తు ఉండదు. రోజూ తిరిగే దారుల్ని కూడా మరిచిపోతారు. మాట్లాడడానికి పదాలు వెతుక్కుంటూ ఉంటారు. చిన్న చిన్న లెక్కలు కూడా చెయ్యలేరు. స్థూలంగా చెప్పాలంటే బాధ్యతగా వ్యవహరించలేరు. దీనివల్ల మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి.  

మహిళలే బాధితులు
డిమెన్షియా ఎక్కువగా మహిళల్లో కనిపిస్తోంది. చదువు రాని గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళల్లో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని సర్వే తేల్చింది. మహిళల్లో 9% మందికి ఈ వ్యాధి ఉంటే , పురుషుల్లో 5.8% మందిలో గుర్తించారు.  పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా అంతరం ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల (5.3%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారు (8.4%) ఈ సమస్యతో అధికంగా బాధపడుతున్నారు.

‘‘భారత్‌లో డిమెన్షియా మీద అవగాహన తక్కువ. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు కిందే దీనిని భావిస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ వ్యాధిపై అంతగా దృష్టి సారించడం లేదు. 2050 నాటికి డిమెన్షియా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతాయి. ఆ సమయానికి దేశ జనాభాలో 19.1శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారి ఉంటారు. వారిలో డిమెన్షియా ముప్పు తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధులు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించవచ్చు.’’  
–ప్రొఫెసర్‌ హమియో జిన్, అధ్యయనం సహరచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే, యూకే  

ఒంటరితనంతో డిమెన్షియా !  
డిమెన్షియా వ్యాధి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. చిన్నతనం నుంచి మెదడుని చురుగ్గా ఉంచే కార్యక్రమాల్లో ఉండకపోతే పెద్దయ్యేసరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా
నిరక్షరాస్యుల్లో ఈ వ్యాధి ఎక్కువ.

పొగతాగడం, మద్యపానం, నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటివి కూడా మనసుపై ప్రభావాన్ని చూపించి డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు సోకుతాయని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు ఒంటరితనం కూడా ఈ వ్యాధి సోకడానికి కారణమవుతోందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరి జీవితం గడిపే వారిలో డిమెన్షియా వ్యాధి సోకే ముప్పు 27% అధికంగా ఉంటుంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top