మరింత మెరుగు! | - | Sakshi
Sakshi News home page

మరింత మెరుగు!

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

మరింత మెరుగు!

హన్మకొండ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలుతో టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. రియల్‌ టైం మానిటరింగ్‌ సిస్టమ్‌తో విద్యుత్‌ సరఫరాలో నాణ్యత పెరిగింది. త్వరగా సమస్యను గుర్తించడంతో పాటు వెనువెంటనే పరిష్కరిస్తూ అతి తక్కువ సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తూ విద్యుత్‌ అంతరాయాల సమయాన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. ఈక్రమంలో హనుమకొండ, వరంగల్‌ సర్కిల్‌లో రియల్‌ టైం మానిటరింగ్‌ సిస్టమ్‌ పనులు వందశాతం పూర్తయ్యాయి.

విస్తృతంగా సాంకేతికత వినియోగం..

హనుమకొండ సర్కిల్‌లోని 59 విద్యుత్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, వరంగల్‌ సర్కిల్‌లోని 68 విద్యుత్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్లను స్కాడాతో అనుసంధానించారు. ఈఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా విద్యుత్‌ సరఫరా నాణ్యతను మరింత మెరుగుపర్చడం, అంతరాయాలను తగ్గించడం, సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించడం, ఫీడర్ల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటోంది.

త్వరితగతిన పరిష్కారం..

రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలోని సూపర్‌వైజింగ్‌ అండ్‌ డాటా ఆక్విజేషన్‌ (స్కాడా కంట్రోల్‌ రూం)కు అన్ని సబ్‌స్టేషన్లను స్కాడాతో అనుసంధానించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన వెంటనే సూపర్‌వైజింగ్‌ అండ్‌ డాటా ఆక్విజేషన్‌కు సమాచారం చేరుతుంది. ఇక్కడ నిరంతరం పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది త్వరితగతిన క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేస్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే స్పందించి వేగంగా సమస్యను పరిష్కరిస్తారు. సమస్యను రియల్‌ టైం ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా విద్యుత్‌ ఫీడర్ల పనితీరును రియల్‌ టైంలో పర్యవేక్షించడంతో పాటు విద్యుత్‌ అంతరాయాలు, ఓవర్‌ లోడ్‌, ఓల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలు తక్షణమే గుర్తించి, సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

వందశాతం పూర్తి..

వరంగల్‌ సర్కిల్‌లో వందశాతం రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ పనులు పూర్తి చేశాం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే త్వరితగతిన గుర్తించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నాం. తక్కువ సయమంలో సమస్యను పరిష్కరించడం ద్వారా వినియోగదారులకు తక్కువ సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం.

– ఎ.ఆనందం, బి.సామ్యానాయక్‌, ఎస్‌ఈలు, వరంగల్‌, హనుమకొండ

ప్రయోజనాలెన్నో..

స్కాడా కంట్రోల్‌ రూమ్‌ నుంచి విద్యుత్‌ సరఫరా పరిస్థితిని రియల్‌టైంలో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

ఫీడర్‌లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే వెంటనే రియల్‌ టైంలో అలర్టులు అందుబాటులోకి వస్తాయి.

ఫీడర్లపై ఓవర్‌ లోడ్‌ ఏర్పడినప్పుడు తక్షణ హెచ్చరికలు వస్తాయి.

విద్యుత్‌ వినియోగం, ఓల్టేజ్‌ స్థాయిలు, లోడ్‌ తదితర వివరాలను రియల్‌ టైమ్‌లో సేకరించి విశ్లేషించే అవకాశం ఉంటుంది.

విద్యుత్‌ సరఫరాలో తలెత్తే సమస్యలు ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం సులభమవుతోంది.

క్షేత్రస్థాయి సిబ్బంది స్పందన వేగాన్ని పెంచి, విద్యుత్‌ అంతరాయ సమయాన్ని తగ్గించవచ్చు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయవచ్చు.

ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

రియల్‌టైం ఫీడర్‌ మానిటరింగ్‌

సిస్టమ్‌తో అంతరాయాల తగ్గింపు

హనుమకొండ, వరంగల్‌ జిల్లాలో

వందశాతం పనులు పూర్తి

వరంగల్‌ సర్కిల్‌లో 68,

హనుమకొండ సర్కిల్‌లో 59

సబ్‌స్టేషన్లు స్కాడాతో అనుసంధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement