సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి నిందితుల అరెస్ట్ వరకు రాజకీయ జోక్యం పెరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘వాడు మా వాడే.. కొంచెం చూసీచూడనట్లు వ్యవహరించండి’.. ‘బెయిల్ వచ్చేంత వరకు సహకరించండి’.. అంటూ రాజకీయ ముఖ్యులు, వారి అనుచరుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌తో పోలీసులు ఆ దిశలోనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం జరుగుతుందని ఠాణా గడప తొక్కితే.. అక్కడ కూడా రాజకీయ జోక్యంతో బాధితులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటిపై వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత దృష్టి సారించి బాధితులకు న్యాయం చేసేలా అధికారుల్లో మార్పులు తేవాలంటున్నారు. గతంలోనూ వరంగల్ నగరంలో కొన్ని కేసుల విషయంలో పోలీసులు రాజకీయంగా ప్రభావితమయ్యారంటూ మరో ముఖ్య రాజకీయ నాయకుడు ఆరోపించడమే కాకుండా.. డీజీపీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మచ్చుకు కొన్ని..
● వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ వివాదాలకు నిలయంగా మారింది. దసరా పండుగ రోజు ఉదయం వైన్‌షాప్ సమీపంలో సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిపై ఒక పాత నేరస్తుడు బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో కంటి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఫిర్యాదు చేసినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు.
● ఓ రౌడీ షీటర్.. వైన్ షాప్ యజమానిని బెదిరించి మద్యం డిమాండ్ చేయడం, మెడికల్ షాప్ యజమానిని బెదిరించి వస్తువులు తీసుకెళ్లిన ఘటనలపై కేసులు నమోదైనా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలున్నాయి.
● గతంలో కేసులు నమోదైన ఒక ప్రధాన నేరగాడు గణేశ్ నిమజ్జనం సందర్భంగా డీజే నిర్వహిస్తున్న సమయంలో, డీజే నిలిపివేయాలని పోలీసులు సూచించగా వారిపై దుర్భాషలాడారు. పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదైనా తదుపరి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.
● ఆయా కేసుల్లో రాజకీయ నేతల జోక్యంతోనే చర్యల విషయంలో పోలీసులు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● హనుమకొండ సబ్ డివిజన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో అత్త, మామలను కొట్టిన కేసులో నిందితుడిపై చర్యల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంఎల్‌సీ నివేదికలోనూ బాధితులను కొట్టారని, గాయాలయ్యాయని వచ్చిన కూడా పోలీసుల నిర్లక్ష్యంతో సీపీ శ్వేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మీరు సదరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కలవాలంటూ చెప్పడంతో పోలీసుల నుంచి ఒక రోజు బందోబస్తు అని, మరుసటి రోజు అదే పనిలో ఉన్నామని, అసలు నిందితుడు ఎక్కడ ఉన్నాడో మీకేమైనా సమాచారం ఉందా.. అంటూ అడుగుతుండడంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు పెంచుతున్నాయి. ఈ కేసు విషయంలోనూ ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తుండడం గమనార్హం.
ఎఫ్‌ఐఆర్ నుంచి అరెస్టుల వరకు నేతల జోక్యమంటూ ఆరోపణలు
నిందితులకు అండగా ఫోన్ కాల్స్.. బాధితులకు తప్పని నిరీక్షణ
వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టి సారించాలంటున్న బాధితులు


