● మాజీ మంత్రి కొండా సురేఖ
వరంగల్ చౌరస్తా/కాశిబుగ్గ: కాలేజీకి నూతన భవన నిర్మాణం, వసతుల కల్పనలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ సహకారం మరువలేనిదని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)కింద అరబిందో ఫార్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన వరంగల్‌లోని కృష్ణాకాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కాలేజీలో పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు 500 మంది చదువుతున్నారని తెలిపారు. ప్రైవేట్ విద్య వ్యాపారమైనందున పారిశ్రామిక వేత్తలు ఇలాంటి కాలేజీల భవన నిర్మాణాల సహకారానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్‌రాజు, అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్, శ్రీధర్ సుమన్, అరబిందో డైరెక్టర్లు సదానందరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.


