అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

ధర్మసాగర్‌: రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని ఓ గార్డెన్స్‌లో చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాలు, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగైదేళ్లుగా పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కొత్త పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. గతంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో మోసం చేసిన వారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ మహిళా సర్పంచులను తమ భర్తలు స్వతంత్రంగా పనిచేయనివ్వాలని సూచించారు. బీఆర్‌ఎస్‌లో ఓ సొంత ఇంటి మహిళే బయటకు వచ్చి తమ కుటుంబీకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపిస్తున్నారంటే ఆమె ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

లబ్ధిదారులకు రూ.55 లక్షలకు పైగా ఆర్థిక సాయం..

ధర్మసాగర్‌ మండలంలో ఐదు కేటగిరీల కింద కొత్తగా 729 మందికి పింఛన్‌ మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే, ధర్మసాగర్‌, రాంపూర్‌ గ్రామాలకు చెందిన 58 మందికి రూ.19.43 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, 27 మందికి రూ.27.03 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు, తుర్కకాశ గ్రామానికి చెందిన 15 మంది మైనారిటీలకు రూ.9 లక్షల విలువైన టూల్‌ కిట్లు పంపిణీ చేశారు. జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ భావ్‌సింగ్‌, ఎంపీడీఓ అనిల్‌ కుమార్‌, పాల్గొన్నారు.

ఎంపీ కడియం కావ్య,

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement