● ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ అర్బన్ : దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మేన శ్రీనుతో పాటు ముస్లిం మత పెద్దలు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ సమైక్యతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వివిధ శాఖల అధికారులు నవీన్ కుమార్, సిద్ధార్థ నాయక్, విజయ్ చంద్ర, రాధాకిషన్, ముస్లిం మతపెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆజాద్ సేవలు చిరస్మరణీయం
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మైనారిటీ సంక్షేమశాఖ బుధవారం నిర్వహించిన అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, డీఈఓ ప్రశాంత్‌రెడ్డి, డీఐఈఓ శ్రీధర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
టీజీపీఎస్సీ చైర్మన్‌ను కలిసిన కలెక్టర్
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను హనుమకొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.


