● ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్
హన్మకొండ : మహిళలు, పేదల అరెస్టు అత్యంత హేయమైన చర్య అని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో బుధవారం మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌ను హనుమకొండలోని టెంపుల్ ట్రీ సిటిలో గృహనిర్భందం చేశారు. అదే విధంగా టీచర్స్ కాలనీలోని స్వగృహంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. కాజీపేట పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేసిన నాయకులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్‌ను అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. శాంతియుతంగా తమ హక్కుల కోసం ప్రశ్నించిన పేద గుడిసెవాసులను, మహిళలను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం కాదా.. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వైఎస్సార్ నగర్‌లో తలదాచుకుంటున్న పేదల భూములపై కన్నేసిన కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని, పేదలను ఖాళీ చేయించే కుట్రలను బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.


