హన్మకొండ: వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వేసవి ప్రణాళికను సిద్ధం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, పీఅండ్ ఎంఎం విభాగాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ అవసరాలను సమగ్రంగా అంచనా వేసి, కొత్త సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల అవసరాన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న కొత్త సబ్స్టేషన్ల పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 33 కేవీ, 11 కేవీ ఓవర్‌లోడ్ ఫీడర్లను గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ లోడ్ అధికంగా ఉండే పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న సబ్స్టేషన్లలో 8 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లపై ఉండే లోడ్‌ను అంచనా వేసి, అవసరమైన చోట సామర్థ్యాన్ని పెంచాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజినీర్లు కె.తిరుమల్ రావు, అశోక్, సురేందర్, జనరల్ మేనేజర్లు విజేందర్ రెడ్డి, అమర్నాథ్, ప్రభావతి, బాబు రావు, ఎస్ఈ (సివిల్) వెంకటేశ్వర్లు, డీఈలు నాగరాజు, అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


