గీసుకొండ: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఆమ్) ప్రోగ్రాం మేనేజర్ శ్రీనివాస్ వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారులతో శుక్రవారం రాష్ట్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆమ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, టి.హబ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నందిత, ప్రోగ్రాం మేనేజర్ శ్రీనివాస్ జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, నిధుల వినియోగం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నూతన భవనాల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. సంబంధిత నివేదికలు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రోగ్రాం మేనేజర్ శ్రీనివాస్ పైడిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సందర్శించి కార్యక్రమాల అమలును తనిఖీ చేశారు. ఆరోగ్య కార్యక్రమాల నివేదికలను సంబంధిత పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఐ.ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు సాజిదా, ఇక్తిదార్ అహ్మద్, అరుణ్ జోషి, రవీందర్, మానస శ్యామల తదితరులు పాల్గొన్నారు.
ఆమ్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీనివాస్


