ఖిలా వరంగల్: బైక్ కొనుగోలు చేశానన్న ఆనందం ఆ యువకుడిలో ఎంతో సేపు నిలవలేదు.. సంతోషంగా బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరిన ఆ యువకుడిని మార్గమధ్యలో మృత్యువు కబళించింది. ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవాల్సిన యువకుడు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి వరంగల్ –ములుగు జాతీయ రహదారిపై అయ్యప్ప టెంపుల్ సమీపాన ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ కళాశాల వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా బాణాలపల్లి గ్రామానికి చెందిన యాట రామ్‌చరణ్ (20) హనుమకొండలోని ఓ సెకండ్ హ్యాండ్ షోరూంలో శుక్రవారం బైక్ కొనుగోలు చేసి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈక్రమంలో ఆరెపల్లి సమీపంలోని ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ కళాశాల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయిన బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయాలై రామ్‌చరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ జవ్వాజి సురేష్, ఎస్సై గోవర్ధన్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.
స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కొనుగోలు చేసిన బైక్‌పైనే మృత్యుఒడికి


