● సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్
కె.లక్ష్మీనారాయణ
కాళోజీ సెంటర్: సమానమైన, నాణ్యమైన విద్య అందించినప్పుడే సామాజిక అంతరాలు తొలగిపోతాయని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసినప్పుడే సమాజంలో ఆశించిన మార్పులు వస్తాయన్నారు. హనుమకొండలోని పెన్షనర్స్ భవనంలో డీటీఎఫ్ వరంగల్ జిల్లా శాఖ గురువారం విద్యా సదస్సు నిర్వహించింది. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ‘విద్యారంగం–సవాళ్లు’ అంశంపై మాట్లాడారు. విద్యార్థులకు స మానమైన, నాణ్యమైన విద్య అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగం వివిధ యాజ మాన్యాల కింద కొనసాగడం సమాజంలో చీలికలకు కారణమవుతోందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో ప్రభుత్వ విద్యారంగం క్ర మంగా కుచించుకుపోతోందని పేర్కొన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించి, ప్రైవేటీకరణను నియంత్రించాలని కో రారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రూపురెడ్డి రామిరెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్‌రెడ్డి,బాధ్యులు డాక్టర్ ఎం.గంగాధర్, చాప బాబుదొర, కె.శ్రీనివాస్, జి.ఆదిరెడ్డి, తంగెళ్ల సుదర్శనం, సోమయ్య, అబ్దుల్ అలీం పాల్గొన్నారు.


