హసన్‌పర్తి : గుర్తు తెలియని ఇద్దరు మహిళలు అమ్మా అంటూ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో మాట మాట కలిపారు.. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు లాక్కొని పరారయ్యారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాయుపుత్ర కాలనీలో మంగళవారం ఈ ఘటన జరగగా పోలీసులు బుధవారం ఆ మహిళల ఫొటోలను విడుదల చేశారు. కాలనీకి చెందిన వృద్ధురాలు కాసర్ల జయప్రద ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. అప్పుడే 30 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు మహిళలు వచ్చి... ఓ అమ్మా అంటూ కేక వేశారు. తలుపు తీసిన ఆ వృద్ధురాలు లోపలికి రమ్మని చెప్పింది. దీంతో మహిళలు మాటలు కలిపి.. మీరు ఎవరో తెలియదని వృద్ధురాలు సమాధానం చెబుతుండగానే ఇద్దరు మహిళలు ఆమె నోట్లో కొంగును కుక్కి చేతుల్లో ఉన్న బంగారు గాజులతోపాటు మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఐదున్నర తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు బాధితురాలు రోదిస్తూ తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు కేయూసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. దొంగలు దోచుకెళ్తున్న దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. వారి ఫొటోలు విడుదల చేశా రు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నగరంలో ఇద్దరు మహిళల సంచారం..
మంగళవారం వాయుపుత్ర
కాలనీలో దోపిడీ
జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు


