వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: కరువు ప్రభావిత రైతులను బ్యాంకులు ఆదుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బ్యాంకు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఈ సమావేశంలో రైతులకు అందించాల్సిన ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన రైతుల పంట రుణాలు పునర్వ్యవస్థీకరణ, రుణ చెల్లింపు గడువు పొడిగింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు కొత్తపంట రుణాల మంజూరు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులను గుర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, యూనియన్ బ్యాంకు డీజీఎం జి.కమలాకర్, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్, నాబార్డ్ డీడీఎం చైతన్య రవి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.జీవన్‌కుమార్, వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, మత్స్యశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.


