వైద్యారోగ్యశాఖలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం | - | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్యశాఖలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

వైద్యారోగ్యశాఖలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

హన్మకొండ అర్బన్‌ : హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి బాగోతం వెలుగులోకి వచ్చింది. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి సమర్పించిన విద్యార్హత ధ్రువపత్రాలు నకిలీవని సంబంధిత విశ్వవిద్యాలయం ధ్రువీకరించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు సదరు వ్యక్తికి నియామక పత్రం జారీ చేయకుండా నిలిపివేశారు. అంతేకాకుండా తనను తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకుంటూ అధికారులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.

హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖలో ఇటీవల ల్యాబ్‌ టెక్నీషియన్లతో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీకి కలెక్టర్‌ పేరుతో నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు అర్హతలు, సీనియారిటీ, రిజర్వేషన్ల ప్రాతిపదికన నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఆత్మకూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌కు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి సమర్పించిన ధ్రువపత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు సంబంధిత విశ్వవిద్యాలయానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయ అధికారులు సదరు సర్టిఫికెట్లు తమ సంస్థ నుంచి జారీ కాలేదని, వాటికి తమ విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ నివేదిక ఇచ్చారు. దీంతో ఆ ధ్రువపత్రాలు నకిలీవని నిర్ధారణ అయింది.

నియామక పత్రం కోసం బెదిరింపులు?

ఫిర్యాదులు అందడంతో విచారణ పూర్తయ్యే వరకు సదరు అభ్యర్థికి నియామక పత్రం జారీ చేయకుండా అధికారులు నిలిపివేశారు. తాను ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నానని, ముందుగా నియామక పత్రం ఇవ్వాలని, అవసరమైతే ఆ తర్వాత విచారణ చేసుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ విచారణ పూర్తయ్యాకే నియామక పత్రం జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో సదరు వ్యక్తి కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

క్రిమినల్‌ కేసు నమోదుకు చర్యలు?

నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే నియామక పత్రం జారీని నిలిపివేయగా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అధికారులను తప్పుదోవ పట్టించడం, కార్యాలయానికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో మిగిలిన ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపైనా అధికారులు మరింత దృష్టి సారించినట్లు సమాచారం.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగం కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వ్యక్తి

తాము జారీ చేయలేదని

ధ్రువీకరించిన విశ్వవిద్యాలయం

నియామకపత్రం ఇవ్వకుండా

నిలిపేసిన అధికారులు

క్రిమినల్‌ కేసు నమోదు చేసే

దిశగా చర్యలు

హనుమకొండ జిల్లా

వైద్యారోగ్యశాఖలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement