హన్మకొండ అర్బన్ : అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద వరంగల్ నగరంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై కేంద్ర అధికారులు సమీక్ష నిర్వహించారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ ఇషా కలియా ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరదల నివారణకు కాల్వల నిర్మాణం, ఖిలా వరంగల్‌లో మోటుబావి అభివృద్ధి, వరంగల్ బస్‌స్టేషన్, హనుమకొండ చౌరస్తా అభివృద్ధి, బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు తదితర పనులకు సంబంధించిన నివేదికలపై సమర్పించారు. ఈ నివేదికలపై కేంద్ర జాయింట్ సెక్రటరీ కలియా సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్రావు పాల్గొన్నారు.
6నుంచి సెలవులో హనుమకొండ కలెక్టర్
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు సెలవులో వెళ్లనున్నారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి పంపిన సెలవు దరఖాస్తుకు ఆమోదం లభించింది. దీపావళి పండుగ నేపథ్యంలో స్వస్థలానికి వెళ్లేందుకు సెలవు తీసుకున్నట్లు సమాచారం.


