● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ నుంచి ఐనవోలు కమాన్ వరకు ప్రమాదకరమైన స్థలాలను (బ్లాక్ స్పాట్స్) అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, ఆర్టీఓ రంగారావు, ఏసీపీలు సత్యనారాయణ, వెంకటేష్, తహసీల్దార్ ఇక్బాల్‌లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులతో పాటు జిల్లాలోని ప్రధాన రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సర్వేల్యాండ్, రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, సిటీ ప్లానర్ రవీందర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కాజీపేట అర్బన్ : ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఆధ్వర్యంలో మంగళవారం హంటర్‌రోడ్డులోని ‘డీ’ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ పరిచయ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బలపరచిన సర్వోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ‘కుడా’ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
‘పత్తి’ పతనం!
● నెల రోజుల్లో క్వింటాకు
రూ. 600 తగ్గిన ధర
ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో పత్తి పంట ధరలు రోజురోజూకూ పడిపోతున్నాయి. గత నెలలో క్వింటాకు రూ. 9,250 ఽపైగాధర పలకగా.. ప్రస్తుతం రూ.8,790కి తగ్గింది. నెల రోజుల్లోనే క్వింటాకు రూ. 600 మేర ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం మార్కెట్‌కు రోజుకు 2వేల బస్తాలకు మించి అమ్మకాలకు రాలేదు. ప్రస్తుతం రైతులు అమ్మకాలు పెంచడంతో మార్కెట్‌కు సుమారు 4వేల బస్తాల పంట చేరుతోంది. అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేని క్రమంలో ధరల పతనం తమకు మరింత భారంగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు.


