కొనుగోలు కేంద్రాల వివరాలు
సాక్షి, వరంగల్: పత్తి రైతులకు ఈసారి పరిస్థితులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడిపై ఆందోళన నెలకొనగా.. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు అ ధిక ధరలు చెల్లిస్తుండడం కొంత ఊరటనిస్తోంది. భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోళ్లు గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో మార్కెట్‌లో పోటీ పెరిగే అవకాశం ఏర్పడింది.
పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మార్కెట్ల పరిధిలో 19 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర మీడియం స్టేపుల్ పత్తికి రూ.8,267, లాంగ్ స్టేపుల్‌కు రూ.8,667 మద్దతు ధరకు అనుగుణంగా సీసీఐ కొనుగోళ్లు చేపట్టనుంది. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులు మాత్రం ప్రస్తుతం క్వింటాకు రూ.9,300 నుంచి రూ.9,600 వరకు చెల్లిస్తున్నారు. దీంతో సీసీఐకి విక్రయించాలా? ప్రైవేట్ వ్యాపారులకు అమ్మాలా? అనే విషయంలో రైతులు లెక్కలు వేసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్‌లో దిగుబడి తగ్గితే ధరలు పెరగొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి.
3,22,136 మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి ప్రధాన వాణిజ్య పంటగా కొనసాగుతోంది. జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబా బాద్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో వేలా ది మంది రైతులు పత్తి సాగుపైనే ఆధారపడుతున్నారు. జనగామ జిల్లాలో 1,38,325 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 1,12,044 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,09,442 ఎకరా లు, మహబూబాబాద్ జిల్లాలో 91,916 ఎకరా లు, హనుమకొండ జిల్లాలో 75,740 ఎకరాలు, ములుగు జిల్లాలో 27,132 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో 5,54,599 ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 3,22,136 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, ప్రైవేట్ వ్యాపారుల పోటీతో సీసీఐకు తక్కువ సంఖ్యలో పత్తి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
కిసాన్ కపాస్ యాప్‌తోనే కొనుగోళ్లు
సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలంటే కపాస్ కిసాన్ యాప్‌లో పేరు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా వివరాలతో ఈ యాప్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. రైతు భూమి, సాగు విస్తీర్ణం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీతో అనుసంధానించి స్లాట్లు కేటాయిస్తారు. ఈ సారి స్లాట్ బుకింగ్ గడువును ఏడు రోజుల నుంచి 14 రోజులకు పెంచారు. రైతు రోజుకు 100 క్వింటాళ్ల వరకు విక్రయించొచ్చు. పత్తి నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు ధరను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, కేటాయించిన తేదీనే కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో సీసీఐ
ఆధ్వర్యంలో 19 కేంద్రాలు
5,54,599 ఎకరాల్లో పంట సాగు
3.22 లక్షల మెట్రిక్
టన్నులొస్తుందని అంచనా
దిగుబడిపై ఎల్‌నినో ఎఫెక్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మార్కెట్ల పరిధిలో అధికారులు 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ములుగు, కేసముద్రం – ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ – ఏ, బీ, ఘన్‌పూర్, ఆత్మకూరు, రాంపూర్, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్ – ఏ, బీ కేంద్రాలున్నాయి. ఇప్పటికే జిన్నింగ్ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనాలు, తాత్కాలిక ఉద్యోగుల కోసం టెండర్లు ఆహ్వానించి తీసుకున్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.


