సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముందుండడంతో కాంగ్రెస్‌లో రగిలిన అసంతృప్తి జ్వాలలు ఆ పార్టీని పుట్టి ముంచుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సురేఖను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయడంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన కొండా సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిఽథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కొద్ది నెలల క్రితం వరకు బల్దియా మేయర్‌గా పనిచేసిన గుండు సుధారాణికి కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం రాజకీయ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నా ఆమె ప్రభావం బల్దియా ఎన్నికల్లో ఏమేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమే. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయంలో అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో విభేదాలు తారస్థాయిలో ఉండడంతో అప్పుడు కార్పొరేటర్లు ఆమెకు పెద్దగా సహకరించిన దాఖలాలు లేవనే చర్చ కూడా ఉంది. ఇంకో వైపు బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ సారయ్య, కాంగ్రెస్ పార్టీ విధేయురాలిగా ఉంటూ వస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా కొండాను వ్యతిరేకిస్తూ వస్తున్నా క్షేత్రస్థాయిలో వీరు ఎంతవరకు బల్దియా ఎన్నికల్లో పార్టీని గాడినపెడతారోనన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏ రకంగా చూసుకున్న ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖ ఇప్పటికే గత పంచాయతీ ఎన్నికల్లో గీసుకొండ మండలం నుంచి ఏడుగురు తమ వర్గీయులను గెలిపించుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మాత్రం కొండా వర్గీయులను కార్పొరేటర్లుగా బరిలోకి దింపి హస్తం పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇలా ఒకే పార్టీ లో వేర్వేరు రాజకీయాలతో బల్దియా ఎన్నికలు కొండంత ఆందోళన కలిగిస్తున్నాయి.
కొండా వర్గం బరిలో ఉంటుందనే ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కొండా దంపతులు తమ వర్గీయులకు డివిజన్లలో ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి స్వర్ణ అసంతృప్తి వ్యక్తం చేసినా అవేమీ పట్టించుకోకుండా బల్దియా ఎన్నికల కోసం ఇప్పటికే ఓ బృందాన్ని రెడీ చేశారనే చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా అడుగులు ఎటువైపు ఉంటాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తమ సొంత ఎజెండాను అమలు చేస్తారా? లేదా ఇతరత్రా రాజకీయ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ఈ కల్లోలాన్ని గ్రేటర్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలని అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ భావిస్తుండడం పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి.
తూర్పులో పోలీసుల భారీ బందోబస్తు
వరంగల్ చౌరస్తా : కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో వరంగల్ పరిధి పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, ఆర్టీసీ బస్ స్టేషన్, వెంకట్రామా జంక్షన్, లేబర్ కాలనీ, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్ స్టేషన్ల పో లీసులు గురువారం సాయంత్రం భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
కార్పొరేషన్ ఎన్నికల ప్రభావంపై చర్చ
మంత్రిగా సురేఖ బర్తరఫ్‌తో
మారిన లెక్కలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అలజడి
అందుకే కుడా చైర్‌పర్సన్‌గా
గుండు సుధారాణికి చాన్స్
కొండా, కాంగ్రెస్ వర్గాలుగా
పోటీ ఉంటుందనే చర్చ


