సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్‌ఎస్ హయాంలో మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పుడు ‘కుడా’ చైర్‌పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు.
సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పు
కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది.
ఇంటివద్ద సంబురాలు
వరంగల్ చౌరస్తా : కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
గుండు సుధారాణికి మరో కీలక పదవి..
‘కుడా’ చైర్‌పర్సన్‌గా నియామకం
సురేఖ బర్తరఫ్‌తో మారిన సామాజిక సమీకరణలు
పద్మశాలి వర్గానికి మళ్లీ ప్రాధాన్యం..
సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు..
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా పదవి ఇచ్చి నాపై సీఎం రేవంత్‌రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. ఆయనకు కృతజ్ఞతలు. బీసీల అభ్యున్నతి, మహిళా సాధికారతకు కృషి చేస్తా. నా నియామకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– గుండు సుధారాణి


