‘గ్రేటర్’లో యూజీడీకి కీలక ముందడుగు
సాక్షిప్రతినిధి, వరంగల్:
గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (కాంప్రెన్సివ్ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ స్కీం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎస్టీపీలు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు (ఎస్‌పీఎస్), లిఫ్ట్ స్టేషన్లు, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణానికి అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు మార్గం సుగమం చేసింది. భూసేకరణ, పునరావాస చట్టం–2013 కింద సాధారణంగా చేపట్టాల్సిన సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ (ఎస్‌ఐఏ)) ప్రక్రియ నుంచి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఎంఎస్ నంబర్ 225 జారీ చేసింది.
నగరానికి కీలకం ఈ ప్రాజెక్టు...
గ్రేటర్ వరంగల్ పరిధి విస్తరిస్తున్న కొద్దీ నివాస, వాణిజ్య ప్రాంతాలు పెరుగుతున్నాయి. దీంతో రోజురోజుకూ మురుగునీటి ఉత్పత్తి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో స్థానిక డ్రెయినేజీలు, నాలాలు, సెప్టిక్ ట్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు వర్షపు నీటి కాలువల్లోకి చేరుతుండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో ప్రధాన సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ సామర్థ్యం సరిపోకపోవడం, నాలాలు ఆక్రమణలకు గురికావడం, మురుగు ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడటం వంటి కారణాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి ఒక సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నెట్‌వర్క్ అవసరం ఏర్పడింది. కాగా కొత్త వ్యవస్థలో మురుగునీటిని నేరుగా బయటకు వదలకుండా వివిధ ప్రాంతాలనుంచి సేకరించి శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
ఐదు ప్రాంతాల్లో భూములు..
ఎస్‌ఐఏనుంచి మినహాయింపు..
తాజా ఉత్తర్వుల ప్రకారం బొల్లికుంట, ఉర్సు, ఖిలా వరంగల్, దేశాయిపేట, పైడిపల్లి ప్రాంతాల్లోని ప్రైవేట్ భూములను సేకరించనున్నారు. మొత్తం 11 నిర్మాణాలకు భూములు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అందులో బొల్లికుంటలో ఎస్టీపీ–7 కోసం 2 ఎకరాల 8.8 గుంటలు సేకరించనుండడం అత్యధిక విస్తీర్ణం. మిగిలిన ప్రాంతాల్లో ఎస్‌పీఎస్‌లు, లిఫ్ట్ స్టేషన్లు, సెప్టిక్ ట్యాంకుల కోసం కొన్ని వందల చదరపు గజాల చొప్పున భూములు తీసుకోనున్నారు. కాగా, ప్రాజెక్టు ప్రజాప్రయోజనాలకు సంబంధించినదిగా పేర్కొంటూ, తెలంగాణ సవరణ చట్టం–2016లోని సెక్షన్ 10ఏ (బీ) కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ) ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చారు. భూసేకరణ కోసం అవసరమైన భూమిని సాధ్యమైనంత కనిష్ట విస్తీర్ణంలోనే తీసుకుంటున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి టీకే శ్రీదేవి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌ఐఏ మినహాయింపుతో భూసేకరణ ప్రక్రియలో ఒక దశ తగ్గడంతో ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం గెజిట్ ప్రచురణకు ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. భూముల సేకరణ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదిత ఎస్‌టీపీలు, ఎస్‌పీఎస్‌లు, లిఫ్ట్ స్టేషన్లు తదితర నిర్మాణాలకు మార్గం సుగమం కానుంది.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించడం చాలా అవసరం. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డిని అందరం కలిసి చాలాసార్లు విన్నవించాం. ప్రజలు ఎదుర్కొంటున్న డ్రెయినేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు.
– నాయిని రాజేందర్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే
ఐదు ప్రాంతాలు, 11నిర్మాణాలకు ప్రైవేట్‌గా భూముల సేకరణకు
ప్రభుత్వం ఓకే
సామాజిక ప్రభావ అంచనానుంచి మినహాయింపు
ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం.. తక్షణమే గెజిట్ ప్రచురణకు ఆదేశాలు
ఉత్తర్వులు జారీ చేసిన
ప్రభుత్వ కార్యదర్శి టీకే శ్రీదేవి


