హన్మకొండ అర్బన్ : భవన నిర్మాణ అనుమతుల ప్రకారం కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ హెచ్చరించారు. నగరంలోని స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకాజీ కాలనీలోని మెప్సన్, న్యూ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్లను పరిశీలించారు. మెప్సన్‌లో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ గదులను తనిఖీ చేసి పరీక్షల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. న్యూ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు తాళం వేసి ఉండటంతో సెల్లార్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు కేంద్రాల్లోనూ భవన నిర్మాణ అనుమతుల ప్రకారం పార్కింగ్‌కు కేటాయించిన స్థలాలను డయాగ్నొస్టిక్ సేవలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.అప్పయ్యను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ అప్పయ్య కాకతీయ కిడ్నీ సెంటర్, సిద్ధార్థ కార్డి యాక్ సెంటర్, వినోద డెంటల్, మల్లిక చిల్డ్రన్స్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రదేశాలను మెడికల్ షాపులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వాటికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్
పలు డయాగ్నొస్టిక్ సెంటర్లకు
నోటీసులు ఇవ్వాలని ఆదేశం


