108లో తీసుకొస్తే పట్టించుకోరు!
కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన వరంగల్ మహాత్మాగాంధీ ఆస్పత్రి (ఎంజీఎం)లో రోగులకు తిప్పలు తప్పట్లేదు. వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సరైన వైద్యం అందట్లేదని వాపోతున్నారు. ఆస్పత్రిలోని పలు వార్డులను బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా.. అనేక సమస్యలు వెలుగుచూశాయి. బుధవారం పిల్లల వార్డులో సైలెన్ బాటిల్‌ను గోడకు వేలాడదీసి చికిత్స అందించారు. మరోవైపు ఓ చిన్నారికి పెట్టిన సైలెన్ బాటిల్‌ను తల్లి చేత్తో పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఇన్ని కష్టాలకోర్చినా వార్డు సిబ్బందికి అంతో ఇంతో ముట్టజెప్పక తప్పట్లేదని వాపోతున్నారు. ఆర్థో, కార్డియాలజీ, డయాలసిస్ వార్డుతోపాటు సీఓటీలో ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. ఆర్థ్ధోపెడిక్ విభాగంతోపాటు న్యూరో సర్జరీ విభాగంలో ప్రధాన శస్త్ర చికిత్సలను ఎప్పుడో నిలిపివేసినట్లు తెలుస్తోంది.
రోగుల వెతలు ఇలా..
పర్వతగిరి మండలం కొంకపాకకు చెందిన ఓ రోగి రెండో అంతస్తులోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎక్స్‌రే అవసరం ఉందని వైద్యులు చెప్పారు. నర్సింగ్ సిబ్బంది సూచన మేరకు సదరు బాధితుడిని కింద ఉన్న రేడియాలజీ విభాగంలో ఎక్స్‌రే విభాగానికి తీసుకెళ్లాలి. 92వ నంబర్ గదిలో ఎక్స్‌రే తీయించడానికి స్ట్రెచర్‌పై పేషెంట్‌ను కుటుంబ సభ్యులే తీసుకెళ్లి తిరిగి వార్డుకు తీసుకొచ్చారు. ఈ విషయమై రోగి అటెండెంట్‌తో మాట్లాడగా.. ‘ఏం చేయాలి సార్, ఎక్స్‌రే కోసం తీసుకెళ్లడానికి ఎవరూ రావట్లేదు. మేమే కష్టాలు పడుతూ తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాం’ అంటూ వాపోయారు.
పేషెంట్‌ను రోడ్డుపై వదిలేశారు..
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రోగుల అవసరాన్ని బట్టి టుడీ ఇకో కోసం ఆస్పత్రి అంబులెన్స్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించి తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకురావాలి. బుధవారం శివనగర్‌కు చెందిన ఓ రోగికి సూపర్ ఆస్పత్రిలో టుడీ ఇకో చేయించి, ఎంజీఎం వద్ద రోడ్డుపై వదలేసి వెళ్లారు. దీంతో పేషెంట్ అటెండెంట్ గత్యంతరం లేక ఎండలో స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన పేషెంట్‌ను తానే నెట్టుకుంటూ వార్డుకు తీసుకెళ్లాడు. దీనిపై అటెండెంట్ మాట్లాడుతూ.. ‘సర్కార్ దవాఖానలో ఇట్లా ఉంది. అంబులెన్స్‌లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ రూ.50 తీసుకున్నారు. ఇక్కడ ఏమీ ఇవ్వలేదని రోడ్డుపై వదిలేశారు’ అని తెలిపారు.
రోగిని ఆర్థో వార్డుకు తీసుకెళ్తున్న అటెండెంట్
ఎంజీఎంలో అడుగడుగునా రోగులకు కష్టాలు
వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం
ప్రజాప్రతినిధుల పట్టింపు కరువు
‘సాక్షి’ పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి..
ఆపదలో ఆదుకునే 108 అంబులెన్స్‌లో తరచూ పేషెంట్లను అత్యవసర చికిత్స కోసం క్యాజువాలిటికి తీసుకొస్తారు. వాహనం నుంచి ఆస్పత్రిలో చేర్పించేందుకు ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పేషెంట్ కేర్, వార్డుబాయ్‌లు సహాయం చేయడానికి రారనే ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఏ వార్డులో చూసినా సమస్యలు తాండవిస్తున్నట్లు రోగులే చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు నిత్యం ఓపీ సమయాల్లో రౌండ్‌లు వేయాలని, ప్రతీ వార్డుపై పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు.
నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం..
ఎంజీంఎం ఆస్పత్రి పేషెంట్ల సేవల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటాం. అయితే క్యాజువాలిటీతో పాటు వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే వారి గురించి భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయాలి. 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం తీసుకొచ్చే సిబ్బందితో పాటు ఎంజీఎం సిబ్బంది కూడా సహకరించి, సేవలందించాలి. పేషెంట్ల వద్ద నుంచి ఎవరు డబ్బులడిగినా సహించేది లేదు. పేషెంట్ల సేవలు మెరుగుపర్చడం, అసంపూర్తి పనులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తాం. – డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్


