వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. ఖుష్‌మహల్‌లో ఏర్పాటు చేయనున్న అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ ఏర్పాట్లు ఆదివారం లోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, హౌజింగ్ పీడీ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు
భూభారతి చట్టం–25 అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని (వర్ధన్నపేట మండలం మినహాయించి) అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఆవరణలో సదస్సులు ఉంటాయని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ భూములతో పాటు గ్రామస్థాయిలో ఉండే భూసమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రెండు బృందాలుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యల పరిష్కారానికి రైతులు సదస్సులు వినియోగించుకోవాలని కోరారు.
3నుంచి రెవెన్యూ సదస్సులు
వరంగల్ కలెక్టర్ సత్యశారద


