
‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలి
ఆదివాసీ హక్కుల పోరాట
సంఘీభావ వేదిక డిమాండ్
నయీంనగర్: ఇటీవల ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దులోని ఊసూరు కర్రిగుట్టలోకి ఆపరేషన్ కగార్ పేరుతో వేలాదిగా పోలీస్ బలగాలు జరుపుతున్న కాల్పులను వెంటనే ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కోరింది. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక సభ్యులు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, పౌరహక్కుల సంఘం నుంచి పి.రమేష్, మానవ హక్కుల సంఘం బాదావత్ రాజు, టీపీఎఫ్ జె.కుమారస్వామి, సీఎంఎస్ కళావతి, శాంతక్క మాట్లాడారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి, మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలని కోరారు. మధ్యభారతంలో అపార విలువైన ఖనిజ వనరులను దేశ, విదేశీ వాణిజ్య సామ్రాజ్యవాదులు, కార్పొరేట్‌లతో ఒప్పందాలు చేసుకొని అందులో భాగంగా ఆదివాసీలు, వారికి అండగా ఉన్న మావోయిస్టులను అంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఇరువర్గాలు కాల్పులు విరమించి శాంతిచర్చల వైపు ప్రయత్నాలు చేయాలని సూచించారు. సమావేశంలో కోడం కుమార్, రాచర్ల బాలరాజు, క్రాంతి, శివ, ప్రవీణ్ కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.