ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. రింగ్ రోడ్డు పనుల పురోగతిపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో భాగంగా ఖిలా వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు సమగ్ర నగరాభివృద్ధికి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుమ, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు.
మద్ది మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష
నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరలోపు పనులు పూర్తయ్యేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
కాజీపేట: రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాలని కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో శనివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ మాట్లాడుతూ.. భవిష్యత్ పోరాటంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఒక మంచి లక్ష్యంతో సాగుతున్న ఉద్యమానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించడానికి ముందుకు రావాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ ఎండీ అబూ బక్కర్, నార్లగిరి రమేశ్, కాటపురం రాజు, బి.రంజిత్‌కుమార్, సందెల విజయ్, పి.శివకుమార సుంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి


