‘వడదెబ్బ’ బాధితులకు భరోసా!
సంగెం/కాజీపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను ప్రత్యేక విపత్తుగా పరిగణించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో వడదెబ్బతో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఇందుకోసం త్రిసభ్య కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ వడదెబ్బతో చనిపోయిన వారి వివరాల నివేదికను కలెక్టర్‌కు పంపిస్తుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఇటీవల ఆ మొత్తాన్ని రూ. 4 లక్షలకు పెంచింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అవగాహన లోపంతో పరిహారానికి దూరం..
వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, రైతులు, హమాలీలు, ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృతి చెందుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్భందు పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించేది. అధికారులు అందజేసిన నివేదిక ఆధారంగా అర్హుల జాబితా వరుస క్రమంలో నిధుల లభ్యతను బట్టి సాయం అందించేవారు. ఆపద్భందు పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా, వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు దరఖాస్తులు చేసుకునేవారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయిందనే చెప్పొచ్చు. సాయం అందకపోవడం, పరిహారం తక్కువ ఉండడం, పోస్టుమార్టం వ్యయప్రయాసాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబసభ్యులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కాగా, వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి పేరిట రైతుబీమా ఉంటే రెండింటిలో ఒక పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు
గతంలో రూ. 50 వేలు..
ప్రస్తుతం రూ.4లక్షలు
పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి
మృతిపై సమాచారం అందించాలి
త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా పరిహారం చెల్లింపులు
ఇవీ నిబంధనలు...
వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందించడం మృతుల కుటుంబాలకు కాస్త ఊరట కలిగించే అంశమే.
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలోకి తీసుకుంటారు.
వడదెబ్బతో అస్వస్థతకు గురై మరణిస్తే తహసీల్దార్, వైద్యాధికారి, ఎౖస్సైతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలి.
మృతుల కుటుంబ సభ్యులు ముందు ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీస్ శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి.
ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందు వైద్యాధికారి ధ్రువీకరించాలి.
అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించాలి.
పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీసుస్టేషన్‌కు అందజేస్తే ఎఫ్‌ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు.
అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి.
పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యాధికారి పరిశీలించి కలెక్టర్‌కు సమర్పించాలి.
ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది.
వడదెబ్బపై అవగాహన కల్పిస్తున్నాం
వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పరిహారం పెంచింది. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. వైద్యశాఖ ద్వారా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే త్రిసభ్య కమిటీకి తెలపాలి. నిబంధనల మేరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తాం.
–గనిపాక రాజ్‌కుమార్,
తహసీల్దార్, సంగెం
‘వడదెబ్బ’ బాధితులకు భరోసా!
‘వడదెబ్బ’ బాధితులకు భరోసా!


