
ఓరుగల్లే ఫైనల్..!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి :
బీఆర్‌ఎస్ ఉద్యమాలకు సెంటిమెంట్‌గా భావించే ఓరుగల్లులోనే ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహించాలన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాయకులు స్థల పరిశీలన చేశారు. మొదట గ్రేటర్ వరంగల్ పరిధి హంటర్‌రోడ్డు, లేదా ఉనికిచర్లలో నిర్వహించాలని ఈ నెల 10న మాజీ మంత్రి, సభ ఇన్‌చార్జ్ టి.హరీశ్‌రావు స్థల పరిశీలన చేశారు. ఆతర్వాత హసన్‌పర్తి మండలం దేవన్నపేట అయితే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉంటుందని భావించి అక్కడ కూడా పర్యటించారు. ఇదే సమయంలో ఈసారి సభను వరంగల్‌లో కాకుండా హైదరాబాద్ శివారులో పెట్టాల న్న చర్చ పార్టీలో జరిగినట్లు ప్రచారం జరిగింది. వేసవి ఎండలు తీవ్రమయ్యే సమయంలో వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైతే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఘట్‌కేసర్‌లో సభావేదికను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి ఎల్కతుర్తిలో స్థలాన్ని పరిశీలించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు గోపాల్‌పూర్, మడిపల్లి, చింతలపల్లి శివార్లు.. ఎల్కతుర్తి – భీమదేవరపల్లి మధ్యన కుడి, ఎడమల స్థలాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు రైతులనుంచి అంగీకారపత్రాలు కూడా తీసుకున్నారు.
ఎల్కతుర్తి సభాస్థలిపై కేసీఆర్‌కు నివేదిక.. నేడో, రేపో నిర్ణయం..
సభావేదిక వివరాలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్‌కు అందజేయనున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. సుమారు 15లక్షల మంది వరకు హాజరయ్యే రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే విషయమై ఎల్కతుర్తి మండలంలో నిర్వహించేందుకు పరిశీలించిన రెండు, మూడు స్థలాల వివరాలు, మ్యాప్‌లను పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్‌తో చర్చించి ఆయన నిర్ణయం మేరకు సభావేదికపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రజతోత్సవ సభపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
డ్రోన్ల ద్వారా సభావేదిక మ్యాపింగ్..
ఎల్కతుర్తి మండల కేంద్రంలో అనువైన ప్రదేశాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి బుధవారం బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముల్కనూరు రోడ్డు, చింతలపల్లి రోడ్డు సమీపంలో ని అనువైన ప్రదేశాన్ని చూసి అనువుగా భావించిన వారు.. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించారు. ఈ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎల్కతుర్తికి వచ్చే దారులవెంట కిలోమీటర్ దూరంలో గల ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం చూశారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, తదితరులు ఉన్నారు.
ఇక్కడే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సై
తాజాగా ఎల్కతుర్తిలో స్థలాన్ని
పరిశీలించిన నేతలు..
డ్రోన్ కెమెరాలతో సభాస్థలి,
పార్కింగ్ స్థలాల మ్యాపింగ్
కేసీఆర్ దృష్టికి మ్యాప్‌లతో సహా
అన్ని వివరాలు
వేదిక దేవన్నపేటా? ఎల్కతుర్తా?
నేడో, రేపో తేల్చనున్న అధినేత