వరంగల్ అర్బన్: చెత్త నుంచి సంపద సృష్టించుకునేలా వివిధ యూనిట్లు ఏర్పాటు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మేయర్ హనుమకొండ బాలసముద్రంలోని కొబ్బరి బోండాల (కోకో పిట్) ప్రాసెసింగ్ యూనిట్, అంబేడ్కర్ గెస్ట్ హౌస్ ఆవరణలోని విండో కంపోస్ట్ యూనిట్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కొబ్బరి బొండాలను ప్రాసెస్ చేయడం ద్వారా అనేక లాభాలున్నట్లు తెలిపారు. కోకో పిట్ యూనిట్ నిర్వహణ ద్వారా 10 మంది ఎస్ హెచ్ జీ మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కోకో పిట్ యూనిట్‌ను బలోపేతం చేయడానికి వరంగల్ ప్రాంతంలో కోకోపిట్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసే ప్రాంతంలో పర్యటించి ఎరువు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బయో మిథనైజేషన్ ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేసి నిర్వహణలోకి తీసుకోవాలని సీఎంహెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సంపత్‌రెడ్డి, అనిల్ వావ్ ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి
బాలసముద్రం డీఆర్‌సీసీ కేంద్రం తనిఖీ